- హైదరాబాద్ శివారులో దారుణం..
- ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.
Hyderabad | ఓ యువతిని సీరియస్‌గా లవ్ చేస్తున్నాడు. అదే అమ్మాయిని మరో యువకుడు కూడా ప్రేమిస్తున్నాడు. ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్న ఇద్దరు యువకులు స్నేహితులు. అయితే తన ప్రియురాలు ఎక్కడ తన ఫ్రెండ్‌కు దక్కుతుందోనన్న అనుమానంతో అతన్ని చంపేశాడు మరో యువకుడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్(20) నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హైదరాబాద్ ముషీరాబాద్ వాసి హరిహర కృష్ణ అనే యువకుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
హరి, నవీన్ స్నేహితులు కాగా దిల్‌షుక్‌నగర్‌లో ఇంటర్ కూడా కలిసి చదివారు. అదే సమయంలో కాలేజీలో చదువుతున్న అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.
పార్టీ చేసుకుందామని పిలిచి హత్య
అయితే ఈ నెల 17వ తేదీన పార్టీ చేసుకుందామని చెప్పి నవీన్‌ను హరి పిలిచాడు. పార్టీ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు.
హరితో శంకరయ్య మాట్లాడగా గొడవ సద్దుమణిగింది. కానీ తన కోపాన్ని నియంత్రించుకోలేక పోయిన హరి నవీన్‌ను విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. బాడీని ముక్కలుగా చేసి ఈ వేళ్లే కదా తనని తాకిందని వేళ్లను, ఈ గుండె కదా ప్రేమించిందంటూ వాటిని బయటకు తీసి ప్రియురాలికి వాట్సప్‌లో ఫొటోలు పంపించాడు. మర్మాంగం, తలను సైతం వేరు చేశాడు. అనంతరం తనంతట తానే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
ఇదిలాఉండగా నిందితుడు హరిహరకష్ణ మూడు నెలల క్రితం నుంచే నవీన్ హత్యకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు హరిహరకష్ణపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ ప్రాంతమంత భయానకంగా మారి ఉందని పోలీసులు తెలిపారు.
పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన హరి
నాలుగు రోజులైనా నవీన్ కళాశాలకు, ఇంటికి గానీ రాకపోవడంతో ఈ నెల 22న అతని తండ్రి శంకరయ్య నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ రామకృష్ణ.. హరి స్నేహితులను విచారించారు. 22వ తేదీ నుంచే హరి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతని తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించారు.
ఈ క్రమంలో హరిపై ఒత్తిడి పెరగడంతో.. శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. తన ప్రియురాలిని ఎక్కడ దక్కించుకుంటాడనే అసూయతోనే నవీన్‌ను కొట్టి చంపానని హరి పోలీసులకు తెలిపాడు. నవీన్ డెడ్‌బాడీని అబ్దుల్లాపూర్‌మెట్ శివారులోని విజయవాడ హైవేపై పడేసినట్లు హరి పోలీసులకు వివరించాడు.