Hen | ఏదైనా ఘటనలో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేయడం సహజమే. ఆ తర్వాత స్టేషన్ లాకప్‌లో బంధించి, విచారణ చేపడుతారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. ఓ కోడి పుంజును లాకప్‌లో వేశారు. దానికి పోలీసులు కాపలాగా ఉంటున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల పోలీసు స్టేషన్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి శివారులో నాటుకోళ్ల దొంగతనాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం కరివెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. కోడిపుంజును దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
ఆ వ్యక్తితో పాటు, కోడిపుంజును కూడా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వ్యక్తిని లాకప్‌లో వేశారు. కోడిపుంజును స్టేషన్ ఆవరణలో వదిలిపెడితే.. కుక్కలు తినే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. దాన్ని కూడా లాకప్‌లో వేసేశారు.
ఆ కోడికి పోలీసులు కాపలాగా ఉంటూ.. గింజలు వేస్తూ సపర్యలు చేశారు. స్టేషన్‌కు వచ్చిన వారంతా.. పుంజును లాకప్‌లో వేసిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జడ్చర్ల పట్టణ సీఐ రమేశ్‌బాబును వివరణ కోరగా దొంగతనం కేసులో నిందితుడితో పాటు కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.