Site icon vidhaatha

Man Fight With Leopard| ఒక్క మగాడు..చిరుత పులితో పోరాటం!

విధాత : ఓ వైపు తనపై చిరుతపులి మెరుపుదాడి..మరోవైపు పారిపోయే దారి లేని వైనం..ఈ పరిస్థితుల్లో చిరుత నోటికి మరొకరైతే ఆహారంగా మారిపోయేవారు. కాని ఓ వ్యక్తి మాత్రం ఏ మాత్రం భయపడకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాటమే శరణ్యమని తలచి చిరుతతో పోరాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లా ధౌర్‌పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జుగ్నుపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జుగ్నుపూర్ ప్రాంతంలో ఇటుక బట్టి కార్మికులపై చిరుతపులి దాడి చేసింది. దీంతో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. చిరుత పులికి చిక్కిన 35 ఏళ్ల మిహిలాల్ అనే కార్మికుడు మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి వీరోచిత పోరాటం చేశాడు. చుట్టు ఎత్తుగా ఇటుక బట్టిలు ఉండటంతో చిరుత నుంచి తప్పించుకుని పారిపోవడానికి ఎటూ దారి దొరకలేదు. దీంతో తన ప్రాణాలు దక్కించుకునేందుకు చిరుతతో వీరోచితంగా పోరాడాడు. ఛాతి భాగంతో పాటు కుడి చేతిపై దాడి చేసినా వెనక్కు తగ్గలేదు. చిరుతను గట్టిగా అదిమిపట్టాడు. అది పంజాతో గాయపరుస్తున్నా దాని తల భాగాన్ని, నోటిని అదిమిపట్టి వదల్లేదు.

ఇంతలో ఇతర కార్మికులు అక్కడికి చేరుకొని.. రాళ్లు, కర్రలతో పులిపై దాడి చేశాడు. వారిదాడి సమయంలో చిరుత నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా..మెడపై దాడిచేసింది. చివరకు కార్మికుల దాడితో చిరుత దృష్టి కొంత పక్కకు మరలగానే అదును చూసి మిహిలాల్ చిరుతపులి నుంచి తప్పించుకుని పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. కార్మికుల దాడిలో గాయపడిన చిరుత పులి కూడా అక్కడి నుంచి పొలాల్లోకి పరుగెత్తింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మాటు వేసి చిరుతపులికి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. చిరుతతో పోరాటంలో తీవ్రంగా యపడిన మిహిలాల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.

Exit mobile version