Megastar Chiranjeevi | స్వ‌యంకృషి నుంచి.. స్వ‌యంకృతాప‌రాధం దాకా!

Megastar Chiranjeevi | మ‌న మ‌న‌సు అంగీక‌రించినా, అంగీక‌రించ‌క‌పోయినా, నిజ‌మ‌నేది ఒక‌టుంటుంది. దాన్ని ఎవ‌రూ దాచ‌లేరు. అలాగే హుందాత‌నం కూడా వ‌య‌సుకు త‌గ్గ‌ట్లు మారుతుంది. అది ఇన్నేళ్ల జీవితానుభ‌వంతో వ‌స్తుంది. ఈ సృష్టిలోని ఏ ప్రాణీ కూడా జీవ‌న‌చ‌క్రాన్ని అతిక్ర‌మించ‌లేదు. బాల్యం, య‌వ్వ‌నం, వృద్ధాప్యం అనేవి ప్ర‌తీ జీవికి త‌ప్ప‌నిస‌రి. ఆ ద‌శ‌ల‌ను మ‌నం అంగీక‌రించితీరాలి. జీవన‌విధానప‌రంగా, వృత్తిప‌రంగా ఎన్ని శిఖ‌రాలు అధిరోహించినా, మ‌న‌సు వ‌య‌సును అనుస‌రించ‌క‌త‌ప్ప‌దు.  బ‌హుశా మెగాస్టార్ చిరంజీవికి అది న‌చ్చ‌డం లేదేమో. మెగాస్టార్ […]

  • Publish Date - August 14, 2023 / 01:42 PM IST

Megastar Chiranjeevi |

మ‌న మ‌న‌సు అంగీక‌రించినా, అంగీక‌రించ‌క‌పోయినా, నిజ‌మ‌నేది ఒక‌టుంటుంది. దాన్ని ఎవ‌రూ దాచ‌లేరు. అలాగే హుందాత‌నం కూడా వ‌య‌సుకు త‌గ్గ‌ట్లు మారుతుంది. అది ఇన్నేళ్ల జీవితానుభ‌వంతో వ‌స్తుంది. ఈ సృష్టిలోని ఏ ప్రాణీ కూడా జీవ‌న‌చ‌క్రాన్ని అతిక్ర‌మించ‌లేదు. బాల్యం, య‌వ్వ‌నం, వృద్ధాప్యం అనేవి ప్ర‌తీ జీవికి త‌ప్ప‌నిస‌రి. ఆ ద‌శ‌ల‌ను మ‌నం అంగీక‌రించితీరాలి. జీవన‌విధానప‌రంగా, వృత్తిప‌రంగా ఎన్ని శిఖ‌రాలు అధిరోహించినా, మ‌న‌సు వ‌య‌సును అనుస‌రించ‌క‌త‌ప్ప‌దు. బ‌హుశా మెగాస్టార్ చిరంజీవికి అది న‌చ్చ‌డం లేదేమో.

మెగాస్టార్ చిరంజీవి… భార‌త‌దేశ చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో అతికొద్దిమంది మాత్ర‌మే సాధించ‌గ‌లిగిన స్థానాన్ని కైవ‌సం చేసుకున్న అపురూప న‌టుడు. ఒక ఎన్టీఆర్‌, ఒక అమితాబ్‌, ఒక ర‌జ‌నీకాంత్‌, ఒక చిరంజీవి… ఈ న‌లుగురే సినిమాను శాసించిన న‌ట‌శిఖ‌రాలు. ఏఎన్నార్, క‌మ‌ల్‌హాస‌న్‌, మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్‌ లాంటి అద్భుత న‌టులు ఎంత‌మంది ఉన్నా, వీరు సంపాదించిన పేరు ప్ర‌ఖ్యాతులు అన‌న్య‌సామాన్యం. అయితే, ఎన్టీఆర్‌, ఏఎన్నార్ మ‌న‌మ‌ధ్య లేక‌పోయినా, మిగిలిన ఆరుగురు త‌మ న‌ట‌ప్ర‌స్థానాన్ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నారు. మ‌రొక్క‌సారి ఆ ఆరు పేర్లు గ‌మ‌నిస్తే, ఒక్క చిరంజీవి మిన‌హా, మిగిలిన‌వారు క‌థ‌ను న‌మ్ముకుని, వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు ఎంచుకుని విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తున్నారు.

Mahesh Babu | మెహ‌ర్ ర‌మేష్ వ‌లలో ఇరుక్కున్న చిరు.. తెలివిగా ఎస్కేప్ అయిన మ‌హేష్ బాబు

క‌థానాయ‌కుడంటే “క‌థ”కు నాయ‌కుడు. ఆ నాయ‌కుడికి త‌ప్ప‌నిస‌రిగా నాయిక ఉండాల్సిన అవ‌స‌రం లేదు. డాన్సులు అవ‌స‌రంలేదు. డెబ్భైయేళ్ల వ‌య‌సులోనూ, త‌న కూతురి కంటే త‌క్కువ వ‌య‌సున్న అమ్మాయిల‌తో ఎగిరితే, చూట్టానికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్న విషయం చిరంజీవి అంగీక‌రిచ‌డం లేదు. ఇదే విష‌యం మీద ర‌జ‌నీకాంత్ చాలా స్ప‌ష్టంగా త‌న అయిష్టాన్ని వ్య‌క్తం చేశాడు.

దాన్ని పాటిస్తున్నాడు కూడా. ఇటీవ‌ల అమితాబ్‌, ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ వంటి త‌న స‌మ‌కాలీన హీరోలు ( అమితాబ్ ఇంకా పెద్ద‌వాడు కావ‌చ్చు కానీ, చిరంజీవి వ‌య‌సు కంటే త‌క్కువ ఉన్న‌ప్ప‌టి నుంచే ఆయ‌న పాత్ర‌ల ఎంపిక మారింది) న‌టిస్తున్న సినిమాలు, పోషిస్తున్న పాత్ర‌లు చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది.

విక్ర‌మ్‌, జైల‌ర్‌, లూసిఫ‌ర్‌, సిబిఐ5, బ్రోడాడీ, పింక్ లాంటి సినిమాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యాయంటే అందులో సూప‌ర్‌స్టార్‌లు ఉన్నార‌ని మాత్ర‌మే కాదు, సూప‌ర్ క‌థ‌, సూప‌ర్ ద‌ర్శ‌కుడు కూడా భాగ‌మ‌య్యా య‌ని అర్థం. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా, మొద‌టి రోజు వ‌ర‌కే ఆ చ‌రిష్మా. త‌ర్వాత న‌డిపించాల్సిన బాధ్య‌త క‌థ‌దే. ఆ విష‌యం చిరంజీవికి తెలియ‌ద‌నుకోవ‌డం అమాయ‌క‌త్వ‌మే. అటువంటి దెబ్బ‌లు చాలా తిన్నాడు కాబ‌ట్టి.

కానీ, ఇంకా ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కుపోయి, కొంత‌మంది మూఢాభిమానులనే అభిమానుల‌నుకుని, చుట్టూ ఉండే భ‌జ‌న బ్యాచ్ పొగ‌డ్త‌ల‌కు పడిపోయే మ‌న‌స్త‌త్వం ఉంటే జ‌రిగే న‌ష్టమే “ఆచార్య‌బ‌లిశంక‌ర్‌”.క‌మ్మ‌లు, కాపులు, రాజులు, రెడ్లు సినిమాలు నడిపించ‌రు. క‌థ మాత్ర‌మే న‌డిపిస్తుంది. నిన్న‌టిదాకా ఒక మామూలు క‌మెడియ‌న్‌గానే మ‌న‌కు తెలిసిన వేణులో ఒక గొప్ప ద‌ర్శ‌కుడున్నాడ‌ని ఎవ‌రూహించారు? బ‌ల‌గం అనే ఒక క‌ళాఖండం త‌న‌నుంచి వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా మ‌న అనుకోలేదు.

Bhola Shankar | భోళా శంక‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్.. టీమిండియాదే వ‌ర‌ల్డ్ క‌ప్..!

సాధార‌ణంగా చిరంజీవి స‌భాకార్య‌క్ర‌మాల‌లో చాలా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తాడు. చ‌క్క‌గా మాట్లాడ‌తాడు. హిట్ అయిన సినిమాల‌ను, హీరోల‌ను, ద‌ర్శ‌కుల‌ను, హీరోయిన్ల‌ను అభినందిస్తాడు. కానీ, ఈ మ‌ధ్య త‌న ప్ర‌వ‌ర్త‌న‌లో కొంచెం తేడా క‌న‌బడుతోంది. సినిమా స‌క్సెస్ మీట్‌ల‌లో, ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ల‌లో స‌ర‌దాగా మాట్లాడుతున్న‌ట్లున్నా, ఆ హీరోయిన్‌తో తాను ఇంకా డ్యాన్స్ చేయాల‌నుంద‌ని, చెల్ల‌లి పాత్ర‌లో చూట్టం క‌ష్టంగా ఉంద‌ని ‘చ‌మ‌త్క‌రించడం’ కొంచెం ఇబ్బందిగా ఉంది.

ఇదంతా త‌న‌ది ఇంకా చిన్న వ‌య‌సే అని, తానింకా డ్యాన్సులు, ఫైట్లు చేస్తే జ‌నాలు చూస్తార‌ని నిరూపించే ప్ర‌య‌త్న‌మే. త‌న కొడుకైన రామ్‌చ‌ర‌ణ్, ఇప్ప‌టినుంచే వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను, టాలెంట్ ఉన్న ద‌ర్శ‌కుల‌ను ఎంపిక చేసుకుంటూ, ముందుకుసాగుతుంటే, చిరంజీవి మాత్రం ఇంకా మూస‌పాత్ర‌ల కోసం పాకులాడుతూ, పాట‌లు, డ్యాన్సులంటూ, అస‌లు ద‌ర్శ‌కుడ‌నాలంటేనే చిరాకు పుట్టే మెహ‌ర్‌జీల‌తో సినిమాలు తీస్తే ఫ‌లితం ఇలాగే ఉంటుంది.

చుట్ట‌మ‌యితే, ఇంటికి పిలిచి, బ‌ట్ట‌లు-భోజ‌నం పెట్టండి. సినిమా కాదు. ఇటువంటి ప‌రిస్థితే ఆయ‌న‌కు ఇంత‌కుముందు ఓసారి వ‌చ్చింది. హిట్ల‌ర్ సినిమాకు ముందు అన్ని సినిమాలు భ‌యంక‌ర‌మైన ఫ్లాపులు. ఏం చేయాలో, ఎటువంటి క‌థ‌ను న‌మ్మాలో అర్థం కాని స‌మ‌యం. అప్పుడు ఆయ‌న‌కు రీమేక్ క‌లిసొచ్చింది. అప్ప‌టి వ‌య‌సు, ఆనాటి ప‌రిస్థితులు వేరు. ఇత‌ర భాషాచిత్రాలు అప్పుడుమ‌న‌కు తెలియ‌దు. అది ఆదుకుంది. ఇప్ప‌డు?… ఓటిటి అనే స‌ర్వాంతర్యామి అంత‌టా క‌మ్ముకుంది.

భార‌తీయ భాషా చిత్రాలే కాక‌, అంత‌ర్జాతీయ చిత్రాలు కూడా స‌బ్‌టైటిల్స్‌తో వ‌చ్చేస్తున్నాయి. ఇంట్లోవాళ్లు, మ‌న భాష‌ల‌న్నీ చూసేసి,వేరే దేశాల సినిమాల‌ను కూడా క‌వ‌ర్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు – మ‌న హీరోలు, ద‌ర్శ‌కులు ఒళ్లు ఎంత ద‌గ్గ‌ర పెట్టుకోవాలో. మ‌రి ఇటువంట‌ప్పుడు రీమేక్‌ల వెంట ప‌డితే ఎలా? మ‌న ద‌గ్గ‌ర క‌థ‌లు లేవా? మంచి ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు లేరా? మ‌రి ఆర్ఆర్ఆర్‌, పుష్ప‌, రంగ‌స్థ‌లం, కేరాఫ్ కంచెర‌పాలెం, ప‌లాస‌, బింబిసార‌, ఫిదా, బ‌ల‌గం, ద‌స‌రా, సీతారామం, సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌… ఇవ‌న్నీ ఎక్క‌డి క‌థ‌లు? ఈ ద‌ర్శ‌కులంతా ఎవ‌రు?

Hyper Aadi | హైపర్‌ ఆది.. చిరంజీవిని రోడ్డున పడేశావ్‌ కదయ్యా! చీ

నిజానికి ఆచార్య చేసిన డ్యామేజి కంటే వాల్తేర్ వీర‌య్య చేసిన డ్యామేజీనే ఎక్కువ‌. ఆ దిక్కుమాలిన సినిమా వ‌ల్లే చిరంజీవికి భ్ర‌మ‌లు పెరిగాయి. ద‌ర్శ‌కుల‌ను బ‌డ్జెట్‌ను కంట్ర‌ల్‌లో పెట్టుకోమ‌నే చిరు, హీరోల రెమ్యున‌రేష‌న్ గురించి మాట్లాడితే మాత్రం క‌స్సుమంటారు. 20కోట్లు, 50 కోట్లు, వంద కోట్లు… ఏంటివి? ఎవ‌రివి? ఎందుకు? డ‌బ్బులా? కాగితాలా? పైగా టికెట్ రేట్లు పెంచాల‌ట‌. ఎందుకు? భారీ బ‌డ్జెట్ సినిమా అంటారు. ఆ బ‌డ్జెట్‌లో స‌గం హీరోనే తీస‌కుంటే, మ‌ళ్లీ అందులో స‌గం విలువ ద‌ర్శ‌కుడికి, బాలీవుడ్ హీరోయిన్‌కీ పోతే, సినిమాకు నిజానికి ఎంత ఖ‌ర్చ‌వుతోంది.? విచిత్రంగా, 50లు 100లు తీసుకునే హీరోలు స్పందించ‌క‌పోయినా, అంత‌లేని చిరంజీవి ఎందుకు స్పందించిన‌ట్లో అర్థం కావ‌డంలేదు.

త‌న త‌మ్ముడు రోజుకు కోటి రూపాయ‌లు తీసుకుంటాన‌న్నందుకా? ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏ సినిమాకి 20రోజుల కంటే ఎక్కువ డేట్లివ్వ‌డు. అంటే ఆయ‌న‌కు ద‌క్కేది 20కోట్లే. మ‌రి అంత ఉలుకెందుకో?. హీరోల మార్కెట్ మొద‌టిరోజు వ‌ర‌కే. గ‌ట్టిగా మాట్లాడితే మార్నింగ్ షో వ‌ర‌కే. ఇది సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, ఆచార్య‌, ఆగ‌డు, లైగ‌ర్‌, బ‌లిశంక‌ర్ లాంటి వాటితో రుజువ‌యింది.

దానికే ఇంతంత పారితోషికాలా? వాళ్ల‌కి సొంత విమానాలా? సినిమా బ‌డ్జెట్‌ను బ‌ట్టి టికెట్ రేట్ పెడితే త‌ప్పేమిటి? ప్రేక్ష‌కుడు 100 రూపాయ‌ల‌కు బ‌దులు 150, 200 ఖ‌ర్చుపెట్టి, వీళ్ల‌ను బిలియ‌నీర్ల‌ను చేయాలా? అస‌లు ఆ అర్హ‌త వీరికెక్క‌డిది? ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వ్వీ రంగారావు, సావిత్రి, జ‌మున‌.. విజ‌య‌-వాహిని స్టుడియోలో నెల జీతానికి ప‌ని చేసేవారు.

స‌రే.. ఎవ‌రికి ద‌క్కాల్సిన గౌరవం, పారితోషికం వారికి ద‌క్కాల్సిందే. దాన్నెవ‌రూ కాద‌న‌లేరు. కానీ, మా ఇమేజ్‌, మా మార్కెట్ అంటూ అడ్డ‌గోలుగా రెమ్యున‌రేష‌న్లు పెంచేసి, తీరా ఫ‌స్ట్ డేమార్నింగ్ షోకే సినిమా చేతులెత్తేస్తే, బ‌య్య‌ర్ల ప‌రిస్థితి ఏమిటి?నిజ‌మే.. సినిమాలు బాగా ఆడితేనే మ‌రిన్ని సినిమాలు వ‌స్తాయి. 24 విభాగాల కార్మికుల‌కు జీవ‌నోపాధి ల‌భిస్తుంది. ప‌రిశ్ర‌మ ప‌చ్చ‌గా క‌ళ‌క‌ళ‌లాడుతుంది.

Pawan Kalyan: వరుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లికి మ‌రో పెద్ద ట్విస్ట్‌.. నిహారిక‌, ప‌వ‌న్ దూరం..!

దాన‌ర్థం హీరోలు మాత్ర‌మే కోటీశ్వ‌రులు కావాలని కాదు, బ‌య్య‌ర్లు, ప్రేక్ష‌కులు కూడా. ఇప్పుడు పాన్ఇండియా స్టార్ అని పాపుల‌ర్ అయిన తెలుగు హీరో, సినిమాలో 20శాత‌మే న‌టిస్తాడ‌ట‌. మిగిలిందంతా ఆయ‌న బాడీ డ‌బుల్‌(డూప్‌)ల‌తో తీయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయ‌న‌దే ‘డ‌బుల్ బాడీ’. మాట కూడా స‌రిగా రాని ప‌రిస్థితి. కేవ‌లం 24 సినిమాల అనుభ‌వం. పారితోషికం మాత్రం 150 కోట్లు.

ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఆడుతున్న ఇంగ్లీష్ సినిమా, మిష‌న్ ఇంపాజిబుల్ 7లో హీరో టామ్ క్రూజ్ ఆ సినిమా కోసం స్వ‌యంగా 500ల సార్లు స్కై డైవింగ్ చేసాడ‌ట‌. త‌న వ‌య‌సు 61 సంవ‌త్స‌రాలు.ఇదీ మ‌న దౌర్భాగ్యం. ఏది హిట్‌? ఏది లాభం? 500 కోట్లు ఖ‌ర్చుపెట్టి 1000కోట్లు సంపాదించ‌డ‌మా? 3 కోట్లు ఖ‌ర్చుపెట్టి 40 కోట్లు సంపాదించ‌డ‌మా? ఈ రెండింటికీ రుజువులున్నాయ‌ని అంద‌రికీ తెలుసు. తీరా చూస్తే ప్ర‌తీవాడు ప‌బ్‌లు, డ్ర‌గ్‌లు, బ్యాంకాక్‌లు, న్యూయార్క్‌లు. ఇప్ప‌టికే జ‌నాలు ఓటీటీ పుణ్య‌మాని, థియేట‌ర్‌కు రావ‌డం మానేసారు.

చిరంజీవి మాస్ హీరో మాత్ర‌మే కాదు, గొప్ప న‌టుడు కూడా. ఆరాధ‌న‌, స్వ‌యంకృషి, రుద్ర‌వీణ‌, ఆప‌ద్బాంధ‌వుడు లాంటి అపురూప చిత్రాల‌ను అందించాడు.ఎస్‌.. ఖ‌చ్చితంగా చిరంజీవి ఎంతోమందికి స్ఫూర్తిప్ర‌దాత‌. ఇది కాద‌న‌లేని స‌త్యం. నేడు చిత్ర‌ రంగంలో ఉన్న చాలామంది న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఆయ‌న అభిమానులే. అయ‌న్ను చూసే అష్ట‌క‌ష్టాలు ప‌డి సినీరంగంలో ప్ర‌వేశించి, త‌మ టాలెంట్‌తో నిల‌దొక్కుకున్న‌ వారే. కానీ వ‌య‌సులో త‌న‌కు గొప్ప పేరు ప్ర‌ఖ్యాతుల‌నందించిన మాస్ (?) చిత్రాల‌ను ఇంకా ప‌ట్టుకు వేలాడాల్సిన అవ‌స‌రం ఇప్పుడు లేదు. త‌ను ఎప్పుడో నిరూపించుకున్నాడు. మ‌రీ ఆర్ట్, ప్యార‌ల‌ల్ సినిమాల‌ను తీయ‌మ‌ని కాదు.

క‌థా బ‌ల‌మున్న చిత్రాల‌ను ఎంచుకుంటే చాలు. విక్ర‌మ్‌, జైల‌ర్ లాంటివి మాస్ చిత్రాలే క‌దా. త‌న నిజ‌మైన అభిమానులు బాధ‌ ప‌డ‌కుండా ఉంటే చాలు. అచార్య‌, భోళాశంక‌ర్‌ల‌ను అభిమానులే బూతులు తిట్టారు. దుర‌భిమానుల‌ను, కుటుంబ‌ స‌భ్యుల‌ను తృప్తి ప‌రిచే క్ర‌మంలో సినిమాలో వేలు పెట్ట‌డం మంచిది కాదు. ద‌ర్శ‌కుడే సినిమాకు కెప్టెన్‌. త‌ను చెప్పిన‌ట్టు వినేవాడే నిజ‌మైన హీరో. మేం పెద్ద హీరోలం, మా ఫ్యాన్స్ బాధ‌ ప‌డ‌కూడ‌దంటే, ఆచార్య‌లే వ‌స్తాయి. ఇప్ప‌టికైనా నిజాన్ని, కాలాన్ని, క‌థ‌ను న‌మ్మి సినిమా తీయాలి. అప్పుడే చిరంజీవి భార‌త చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిజ‌మైన చిరంజీవిగా వెలుగొందుతాడు.

– అధ‌ర్వ‌.

Jailer | ‘భోళా’ని పాతాళానికి తొక్కేసిన జైల‌ర్.. బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ర‌జ‌నీ ప్ర‌భంజనం

Por Thozhil Review | పోర్ తొళిల్ సినిమా రివ్యూ.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌.. అస్సలు మిస్సవ్వవద్దు

Latest News