Site icon vidhaatha

Chiranjeevi | ఢిల్లీలో చిరంజీవికి ఆప‌రేష‌న్.. బ‌ర్త్ డే వ‌ర‌కు హైద‌రాబాద్ రానున్న మెగాస్టార్

Chiranjeevi |

గ‌త కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి శ‌స్త్ర చికిత్స చేయించుకోనున్నార‌ని తెగ ప్ర‌చారాలు సాగాయి. కొంద‌రు మోకాలి శ‌స్త్ర చికిత్స కోసం విదేశాల‌కి వెళ్ల‌నున్నార‌ని అన్నారు. క‌ట్ చేస్తే ఆయన ఢిల్లీలో మోకాలికి స్వ‌ల్ప శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు.

మోకాలి నొప్పి త‌ర‌చు ఆయ‌న‌ని వేధిస్తుండ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకున్న చిరు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ఎలాంటి కోత లేకుండానే ఆర్ధ్రోస్కోపిక్ విధానంలో శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నారు. ఈ క్ర‌మంలో ఇన్‌ఫెక్ష‌న్ కూడా తొల‌గించిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటున్న చిరు నాలుగు రోజుల త‌ర్వాత హైద‌రాబాద్‌కి రానున్నారు. ఆగ‌స్ట్ 22న చిరు బ‌ర్త్ డే కాగా,ఆ రోజు మెగాస్టార్ కొత్త చిత్రం ప్రారంభం కాబోతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, దర్శకుడు కల్యాణ్ కృష్ణ.

ఇక చిరు చివ‌రిగా భోళా శంక‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించ‌గా, ఈ మూవీ దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. ద‌ర్శ‌కుడు మెహ‌ర్ రమేష్ ఇచ్చిన అవ‌కాశాన్ని వినియోగించ‌కుండా భారీ ఫ్లాప్ అందించాడు.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవ‌డం క‌ష్టంగానే ఉంది. తెలుగులో డిజాస్ట‌ర్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 25న భోళాశంక‌ర్ హిందీ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో విడుదల కాబోతుంది.

హిందీ వెర్ష‌న్‌లో చిరంజీవి పాత్ర‌కు బాలీవుడ్ సీనియ‌ర్ హీరో జాకీ ష్రాఫ్ డ‌బ్బింగ్ చెప్పారు. ఆయ‌న‌తో ఉన్న స్నేహం వ‌ల్లనే అత‌నికి డ‌బ్బింగ్ చెప్పిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా డ‌బ్బింగ్ రైట్స్‌ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆర్‌కేడీ స్టూడియోస్‌ భారీ రేటుకు ద‌క్కించుకున్న‌ట్లు ఇన్‌సైడ్ టాక్.

భోళా శంక‌ర్ చిత్రాన్ని తొలుత తెలుగుతో పాటు హిందీ భాష‌లోనూ ఆగ‌స్ట్ 11న రిలీజ్ కి ప్లాన్ చేయ‌గా, డ‌బ్బింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల డిలే వ‌ల్ల రెండు వారాలు ఆల‌స్యంగా అంటే ఆగ‌స్ట్ 25న హిందీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి యాక్ష‌న్ అంశాల‌ను జోడించిన ఈ సినిమా పూర్తిగా నిరాశ‌ప‌ర‌చింది. అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్ వ‌ల్ల భోళాశంక‌ర్‌ ప్రేక్ష‌కుల్ని ఏమాత్రం మెప్పించ‌లేక చ‌తికిలప‌డింది. కామెడీ, సెంటిమెంట్‌, యాక్షన్‌తో పాటు ఏ అంశంలో కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదంటూ తెగ విమ‌ర్శ‌లు కూడా చేశారు.

Exit mobile version