Site icon vidhaatha

High Court | ప్రధానిని దూషించడం రాజ ద్రోహం కాదు

High Court

కలబురిగి: ప్రధాన మంత్రిని అభ్యంతరకర పదాలతో దూషించడం అవమానించడం కిందికి, బాధ్యతరాహిత్యం కిందకు వస్తుందని, అంతేకానీ రాజద్రోహం కాజాలదని కర్ణాటక హైకోర్టు పేర్కొన్నది. ఈ విషయంలో ఒక స్కూలుపై దాఖలైన రాజద్రోహం నేరాన్ని కొట్టివేసింది.

బీదర్‌లోని షహీన్‌ స్కూలు మేనేజ్‌మెంట్‌లోని అల్లావుద్దీన్‌, అబ్దుల్‌ ఖలేఖ్‌, మహ్మద్‌ బిలాల్‌ ఇనామ్‌దార్, మహ్మద మెహతాబ్‌లపై బీదర్‌లోని న్యూటౌన్‌ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కర్ణాటక హైకోర్టు కలబురగి బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ చందన్‌గౌదర్‌ కొట్టివేశారు. రాజద్రోహంగా పరిగణించేందుకు తగిన సెక్షన్లు ఈ కేసులో లేవని కోర్టు పేర్కొన్నది.

అయితే.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని అసభ్య పదజాలంతో దూషించడం తగదని పేర్కొంది. పౌర సత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా సదరు స్కూలులో 4, 5, 6 తరగతుల విద్యార్థులు 2020 జనవరి 21న ఒక నాటికను ప్రదర్శించారు.

దీంతో ప్రధానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. వాటిపై ఏబీవీపీ కార్యకర్త ఒకరు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. స్కూలు యాజమాన్యాలు పిల్లలు ప్రభుత్వాలను వ్యతరేకించడానికి దూరంగా ఉంచాలని కోర్టు సలహా ఇచ్చింది.

Exit mobile version