బెంగ‌ళూరులో 3 వేల భ్రూణ హ‌త్యలు

క‌ర్ణాట‌క‌లో అబార్ష‌న్ రాకెట్ గుట్టు ర‌ట్ట‌యింది. క‌డుపులోనే ఆడ శిశువుల‌ను చంపేస్తున్న ముఠా పోలీసుల‌కు చిక్కింది.

  • Publish Date - November 28, 2023 / 10:55 AM IST

  • ఆడ పిండాలను తొలగించిన ముఠా
  • ఒక్కో అబార్ష‌న్‌కు రూ.20,000 -25,000
  • ఏటా 1,000 అబార్షన్లు వారి ల‌క్ష్యం
  • ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు ల్యాబ్
  • టెక్నీషియన్లుసహా 9 మంది అరెస్టు


విధాత‌: క‌ర్ణాట‌క‌లో అబార్ష‌న్ రాకెట్ గుట్టు ర‌ట్ట‌యింది. క‌డుపులోనే ఆడ శిశువుల‌ను చంపేస్తున్న ముఠా పోలీసుల‌కు చిక్కింది. భ్రూణహత్యల దర్యాప్తులో పోలీసుల‌కు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్ల‌డ‌య్యాయి. ఇప్పటివరకు నిందితుల ముఠా 3,000 ఆడ పిండాలను తొలగించిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. గత మూడు నెలల్లోనే 242 ఆడ పిండాలను చంపినట్టు తెలిపారు.


బెంగళూరు పోలీసు కమిషనర్ బీ దయానంద్ మంగళవారం మీడియాకు కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. నిందితులు ఇప్పటి వరకు మూడు వేల అబార్షన్లు చేసిన‌ట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు. నిందితులు ఏడాదికి 1,000 అబార్షన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నార‌ని వెల్ల‌డించారు. ఒక్కో ఆప‌రేష‌న్‌కు నిందితులు రూ.20,000 నుంచి 25,000 వరకు వ‌సూలు చేస్తార‌ని చెప్పారు. నిందితులు డబ్బు సంపాదించడానికి సంవత్సరానికి 1,000 అబార్షన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నార‌ని తెలిపారు.


అక్టోబర్‌ 15న బైయప్పనహళ్లి పోలీసులు అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, వాహనం డ్రైవర్ ఆపలేదు. దాంతో అనుమానంలో పోలీసులు వెంబ‌డించి ప‌ట్టుకోగా అబార్ష‌న్ రాకెట్ గుట్టు తెలిసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు కిడ్నాప్ కేసులో కూడా ప్రమేయం ఉన్నట్టు తేలిందని కమిషనర్ దయానంద్ తెలిపారు.


మాండ్యా జిల్లాలోని బెల్లం ఉత్పత్తి యూనిట్‌లో నిందితులు ల్యాబ్‌ను ఏర్పాటు చేసి ఆబార్ష‌న్‌కు అవ‌స‌ర‌మైన‌ సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారని విచారణలో తేలింది. జిల్లా కమిషనర్‌ ఆదేశాల మేరకు బెల్లం ఉత్పత్తి యూనిట్‌ను సీజ్‌ చేసినట్టు మండ్య అసిస్టెంట్‌ కమిషనర్‌ శివమూర్తి తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Latest News