Site icon vidhaatha

Actress Sri Reddy: పోలీస్ విచారణకు హాజరైన నటి శ్రీ రెడ్డి

Actress Sri Reddy:  నటి శ్రీరెడ్డికి పోలీసు నోటీసుల నేపథ్యంలో విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లోవిచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో శనివారం శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సీఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు. అవసరమైతే పిలిచినప్పుడు మళ్లీ విచారణకు రావాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి విపక్ష నేతలను బండబూతులు తిడుతూ వీడియోలు చేసిన నేపథ్యంలో కూటమి కార్యకర్తలు పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదు చేశారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన 6 కేసులలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఫిబ్రవరి 24న హైకోర్టు విచారణ జరిపింది. అయితే చిత్తూరు వన్‌టౌన్‌ ఠాణా పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ కూడా బెయిలబుల్‌ స్వభావం ఉండటంతో శ్రీరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది హైకోర్టు. విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. పలు షరతులు విధించింది. రూ.10 వేలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కర్నూలు టూటౌన్‌, కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్‌, విజయనగరం జిల్లా నెలిమర్ల ఠాణాలో నమోదైన కేసులలో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు శిక్షకు వీలున్నవేనని తెలిపింది. ఈ కేసులకు సంబంధించే శ్రీరెడ్డి ఇవాళ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైంది.

జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లపై సోషల్ మీడియాలో అనుచిత విమర్శలు చేసిన వారందరికి కూటమి ప్రభుత్వం ఊచలు లెక్కబెట్టిస్తుంది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి జైలుకెళ్లి రాగా, రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వైసీసీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు పలువురిపై కేసులు నమోదు చేసింది.

Exit mobile version