Adilabad
విధాత: ప్రకృతి అందాలకు పుట్టినిల్లు అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలకు కొదవలేదు. అలాంటి పురాతన, చారిత్రక ఆలయాల్లో చదువుల తల్లి సరస్వతి దేవి ఆలయం ఒకటి. ఈ దేవాలయం ప్రత్యేక దర్శనీయ స్థలంగా విలసిల్లుతోంది.
దేశంలోనే రెండు సరస్వతి దేవి ఆలయాలు ఉండగా, అందులో నిర్మల్ జిల్లా బాసర లోని సరస్వతి దేవి ఆలయం మరొకటి కావడం విశేషం. ఇక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని వ్యాస మహర్షి ప్రతిష్ఠించినట్టు చెబుతారు. కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి కలత చెందిన వ్యాస మహార్షి.. మనశ్శాంతి కోసం తన శిష్యులతో గోదావరి తీరానికి వచ్చి, ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై, ఈ ప్రాంతంలో కుటీరం నిర్మించుకొని ఇక్కడే తపస్సు చేసినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.
ప్రతి రోజూ పవిత్ర గోదావరి నదిలో స్నానం చేసి, మూడు పిడికిళ్ళ ఇసుకను తెచ్చి కుప్పలుగా పోసి పూజించే వారని స్థానికులు కథలు కథలుగా చెబుతారు. అలా తయారైన కుప్పలే సరస్వతి, లక్ష్మీ, కాళికా ప్రతిరూపాలుగా రూపొందాయని స్థానికులు చెబుతారు. వ్యాసుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసినందున ఈ ప్రాంతానికి వాసర అని, వ్యాస పురి, వాసర క్షేత్రం అని పేరు వచ్చిందని చెబుతారు. వాసర కాస్తా.. కాలక్రమంలో బాసరగా మారింది.
18వ శతాబ్ద కాలంలో జరిగిన దండయాత్రలో కొంత ధ్వంసమైన ఈ ఆలయాన్ని స్థానికుడు అయిన మక్కాజి పటేల్.. గ్రామస్థుల సహకారంతో ఈ ఆలయాన్ని పునరుద్దరించినట్లు చెబుతారు. అనంతరం దేవాదాయ శాఖ ఈ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆలయ పునరుద్దరణ పనులను చేపట్టింది. బాసర సరస్వతి క్షేత్రంలో ప్రతి సంవత్సరం దసరా, వసంత పంచమి, వ్యాస పూర్ణిమ సందర్భంగా ఉత్సావాలు ఘనంగా కొనసాగుతాయి.
రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు సరస్వతి క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. భారీ సంఖ్యలో అమ్మవారి సమక్షంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షర శ్రీకారం చేయిస్తారు. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతి దేవి సన్నిధిలో పిల్లలకు అక్షరభ్యాసం చేయిస్తే పిల్లలు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బాసర ఆలయ పునర్నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది. ఈ ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. రానున్న రోజుల్లో ఈ ఆలయాన్ని సరికొత్త హంగులతో మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నారు.