- ఐటీడీఏ చైర్మన్ లక్కేరావు కారును తగులపెట్టిన ఆందోళనకారులు
- పరిస్థితి ఉద్రికత్తం- పోడు భూములకు (Telangana Podu Lands) పట్టాలు ఇవ్వాలని డిమాండ్
- ఇటీవల ఎస్టీ(ST)ల జాబితాలో చేర్చిన కులాలను తొలగించాలని డిమాండ్
విధాత: పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఇటీవల ఎస్టీల జాబితాలో చేర్చిన కులాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ ఐటీడీఏ (ITDA Utnoor-Adilabad) కార్యాలయం ముందు ఆదివాసీలు (TRIBELS) చేపట్టిన ఆందళన ఉద్రికత్తంగా మారింది. ఆందోళనకారులు ఐటీడీఏ చైర్మన్ లక్కేరావు కారుకు నిప్పు పెట్టారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి కారులోనే ఉన్న లక్కేరావును రక్షించారు.
అయితే అప్పటికే కారుకు నిప్పు అంటుకోవడంతో కారు పూర్తిగా తగులబడి పోయింది. 11 డిమాండ్లతో ఆందోళన. తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని ఇలా మొత్తం 11 డిమాండ్లతో సోమవారం ఆదివాసీలు ఊట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
అలాగే 11 కులాను ఎస్టీల జాబితాలో చేర్చతూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఆదివాసీలు ఆయా కులాలను ఎస్టీల జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఆయా కులాలను ఎస్టీ జాబితానుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా లంబాడీ(Lambadas) లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్‌ను మరోసారి ముందుకు తీసుకువచ్చారు.
ఆదివాసీలు మొత్తం 11 డిమాండ్లతో చేపట్టిన ఆందోళన ఉద్రికత్తంగా మారింది. తొలుత ఐటీడీఏ కార్యాలయం ముందు ఆదివాసీలు ధర్నా చేపట్టారు. ఆ తరువాత కాసేపటికి కార్యాలయంలోపలికి వెళ్లేందుకు ఆదివాసీలు ప్రయత్నించారు.
కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆదివాసీలు ఐటీడీఏ కార్యాలయంపై రాళ్లు రువ్వి దాడి చేశారు. కార్యాలయానికి వచ్చిన ఐటీడీఏ చైర్మన్ లక్కేరావు కారుకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయేలా మారింది. పోలీసులు ఐటీడీఏ కార్యాలయం వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.