Site icon vidhaatha

MLC Kavitha: 1లక్ష 75వేల ఎకరాల కుదవకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర : ఎమ్మెల్సీ కవిత

 

*కాంగ్రెస్ తెచ్చిన అప్పుల్లో లక్ష కోట్లను కాంట్రాక్టులకు ఇచ్చారు*

*సీఎం రేవంత్ రెడ్డికి 20వేల కోట్ల కమిషన్లు అందాయి*

*సొంత పార్టీ నేతలే నాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు*

*టైం వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయటపెడతా*

MLC Kavitha: రాష్ట్రంలో పారిశ్రామిక అవసరార్థం కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన టీజీఐఐసీ సంస్థలో ఉన్న 1,75,000ఎకరాలను స్టాక్ మార్కెట్ లో కుదవ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను ఆమె వెల్లడించారు. నా దగ్గర నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం ఆమె హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. టీజీఐఐసీని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవో నెంబర్ 12ను ఏప్రిల్ 11న విడుదల చేసిందన్నారు. టీజీఐఐసీని ప్రవేటు లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని ఆరోపించారు. తెలంగాణ భూములను, ప్రజల భవిష్యత్తును స్టాక్ ఎక్స్చేంజ్‌లో కుదువపెట్టే భారీ భూ కుంభకోణం జరుగుతోందన్నారు. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని తెలిపారు. ఆధారాలతోనే తాను ఈ ఆరోపణలు చేస్తున్నానన్నారు. కంచె గచ్చిబౌలి ద్వారా ఇప్పటికే రూ.10వేల కోట్ల రుణం తీసుకున్నారని..ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమే అన్నారు. టీజీఐఐసీ కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. కనీసం దీనిపై నిపుణుల సలహాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన లేకపోవడం దారుణమన్నారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. భూములు కుదవ పెట్టి వచ్చిన నిధులను పక్కదారి పెట్టించడమే ఈ ప్రభుత్వం దురుద్దేశమన్నారు. భవిష్యత్తులో వచ్చే కంపెనీలు పెడుతామని వచ్చ వారికి భూములు ఎక్కడి నుంచి ఇస్తారని నిలదీశారు. స్టాక్ ఎక్చెంజ్ ఒడిదుడుకులతో భూములు కోల్పోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ తెచ్చిన అప్పుల్లో లక్ష కోట్లను కాంట్రాక్టులకు ఇచ్చారు

కేసీఆర్ హయాంలో 8లక్షల కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని..తాజాగా పార్లమెంటులో రాష్ట్ర అప్పు 4లక్షల 20వేల కోట్లు మాత్రమే అని చెప్పడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ పాలనలో 16నెలల్లో 1లక్ష 80వేల కోట్లు అప్పులు తెచ్చారని..ఈ నిధుల్లో 80వేల కోట్ల పాత అప్పులకు చెల్లింపులు చేయగా మిగిలిన 1లక్ష కోట్లతో ఒక్క కొత్త పథకంగాని..ప్రాజెక్టు కోసం గాని ఖర్చు చేయలేదన్నారు. ఉద్యోగులకు, పంచాయతీలకు కూడా ఆ నిధులు ఇవ్వలేదన్నారు. ఈ 1లక్ష కోట్లు ఎక్కడకు పోయాయని ఆరా తీస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ నిధులతో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిందని..ఇందులో కమిషన్లుగా సీఎం రేవంత్ రెడ్డికి 20వేల కోట్లు అందాయని కవిత ఆరోపించారు. వారి కమిషన్ల కోసమే తట్టెడు మట్టి ఎత్తకుండానే బడా కాంట్రాక్టులకు లక్ష కోట్లు చెల్లించారన్నారు. నేను చేసిన ఆరోపణలపై అభ్యంతరముంటే ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలను సమాధానం చెప్పాలన్నారు.

సొంత పార్టీ నేతలే నాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు

పార్టీలో నాపై కొందరు పనిగట్టుకుని దుష్ఫ్రచారం చేస్తున్నారని..వారెవరో నాకు తెలుసని..సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయని సొంత పార్టీ నేతలపైనే మరోసారి ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలుకవిత చేశారు. నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నానన్నారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని..ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని తెలిపారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందన్నారు. ఈ సమయంలో నాపై దుష్ప్రచారం సరికాదన్నారు. నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని..టైం వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా… ఇంకా నన్ను కష్టపెడతారా? అని ప్రశ్నించారు. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానన్నారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో ఇప్పటికైనా పార్టీ స్పందిస్తుందనుకుంటున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

Exit mobile version