INDIA | నెలాఖరుకల్లా సీట్ల సర్దుబాటు.. ఇండియా కూటమి నేతల నిర్ణయం

INDIA | ముంబైలో మొదలైన మూడో భేటీ లోగో, కన్వీనర్‌, కనీస కార్యక్రమంపై నేడు చర్చించనున్న నాయకులు ముంబై/న్యూఢిల్లీ: అధికార బీజేపీపై కూటమి తరఫున ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి తీర్మానించింది. ఈ మేరకు సీట్ల సర్దుబాటును సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని కూటమి నేతలు నిర్ణయించారు. పాట్నా, బెంగళూరు తర్వాత ఇండియా కూటమి మూడో సమావేశం గురువారం ముంబైలో ప్రారంభమైంది. పొత్తు ఫార్ములాలను పార్టీల రాష్ట్ర కమిటీలు అమలు చేస్తాయని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. బీజేపీ […]

  • Publish Date - September 1, 2023 / 12:42 AM IST

INDIA |

  • ముంబైలో మొదలైన మూడో భేటీ
  • లోగో, కన్వీనర్‌, కనీస కార్యక్రమంపై నేడు చర్చించనున్న నాయకులు

ముంబై/న్యూఢిల్లీ: అధికార బీజేపీపై కూటమి తరఫున ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి తీర్మానించింది. ఈ మేరకు సీట్ల సర్దుబాటును సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని కూటమి నేతలు నిర్ణయించారు. పాట్నా, బెంగళూరు తర్వాత ఇండియా కూటమి మూడో సమావేశం గురువారం ముంబైలో ప్రారంభమైంది.

పొత్తు ఫార్ములాలను పార్టీల రాష్ట్ర కమిటీలు అమలు చేస్తాయని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అభ్యర్థిపై బహుళ అభ్యర్థుల పోటీని నివారించేందుకు కృషి చేయడంతో పాటు.. కూటమి నుంచి ఒకే అభ్యర్థిని ఉంచనున్నారు.

దీని ద్వారా ఓట్ల చీలికను పూర్తిగా కట్టడి చేసే వీలు ఉంటుందని నేతలు విశ్వసిస్తున్నారని సమాచారం. పాట్నా, బెంగళూరు సమావేశాల నుంచి ఈ ఆలోచన ఉన్నది. దీనికే మూడో సమావేశంలో కూడా మద్దతు లభించిందని తెలిసింది. తొలిరోజు ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని, కీలక చర్చలు శుక్రవారం ఉంటాయని చెబుతున్నారు.

రెండో రోజు సమావేశంలో కూటమి లోగో, కన్వీనర్‌, సమన్వయ కమిటీ అంశాలపై నేతలు చర్చించబోతున్నారు. 2024 ఎన్నికలకు ఒక సంయుక్త కార్యాచరణ ప్రణాళిక/ కనీస ఉమ్మడి కార్యక్రమం కూడా రూపొందిస్తారని సమాచారం. బెంగళూరు భేటీకి 26 పార్టీల నేతలు హాజరుకాగా ముంబై సమావేశంలో 28 రాజకీయ పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే.. అంతకు ముందు ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని వైటీపీ అధ్యక్షురాలు షర్మిల కలుసుకున్నారు. వైటీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారనే వార్తల నేపథ్యంలో ఆమె సోనియాను, రాహుల్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రాజశేఖర్‌రెడ్డి కూతురిగా తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం తాను పనిచేస్తానని అనంతరం ఆమె మీడియాకు చెప్పారు.

పేద‌రికం నిర్మూల‌న‌, నిరుద్యోగితను తగ్గించడం, రైతుల సంక్షేమాల విష‌యంలో కేంద్రం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. ఇండియా కూట‌మి వీటిపై ప‌ని చేస్తుందని చెప్పారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ఇండియా కూట‌మి ఒక స్థానం నుంచి ఒక అభ్య‌ర్థిని మాత్ర‌మే నిలిబెడుతుందని లాలు తెలిపారు.

దేశ ప్ర‌జ‌లు బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని కోరుతున్నారని, అది ఇండియా కూటమి వల్లే సాధ్యమవుతుందని లాలూ కుమారుడు, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ చెప్పారు. యువ‌తే ఈ దేశానికి శ‌క్తి అని పీడీపీ నేత మెహ‌బూబా ముఫ్తీ అన్నారు. నెహ్రూ నుంచి మ‌న్మోహ‌న్ సింగ్ వ‌ర‌కు యువ‌త‌కు మార్గ‌ద‌ర్శకాలు ఇవ్వ‌డం కోసం పని చేశారని, అందుకే జేఎన్‌యూ, ఐఐఎం, ఇస్రో లాంటి సంస్థ‌లను ఏర్పాటు చేశార‌ని చెప్పారు.

Latest News