నేటి నుంచి క్రికెట్‌ ప్రపంచకప్‌.. తొలి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ రెడీ

  • Publish Date - October 4, 2023 / 11:05 AM IST
  • మోతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ సమరం
  • 40 వేల టికెట్లు ఉచితంగా పంచిన బీజేపీ!
  • నగరంలోని 30% పోలీసులతో భారీ భద్రత


ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ గురువారం నుంచి మొదలుకానున్నది. మోతెరాలోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించే తొలి మ్యాచ్‌లో గత ప్రపంచకప్‌ ఫైనలిస్టులు ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య తలపడతాయి. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి క్రికెట్‌ అభిమానులు అహ్మదాబాద్‌కు పోటెత్తుతున్నారు.


ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ నేపథ్యంలో సిటీ మెట్రో టైమింగ్స్‌ మూడు గంటలు పొడిగించారు. తొలి మ్యాచ్‌, ఫైనల్స్‌ సహా మొత్తం ఐదు మ్యాచ్‌లకు మోతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో అక్టోబర్‌ 14న భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే ఉద్వేగ భరిత మ్యాచ్‌ కూడా ఉన్నది. ఫైనల్‌ నవంబర్‌ 19న జరుగనున్నది. అన్ని మ్యాచ్‌లు డై/నైట్‌ మ్యాచ్‌లే. ప్రతి మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది.


గుజరాత్‌ చేరుకున్న ట్రోఫీ


ఐసీసీ వరల్డ్‌ కప్‌ ట్రోఫీ అహ్మదాబాద్‌కు చేరుకున్నది. అంతకు ముందు నర్మద జిల్లాలోని ఏక్తానగర్‌లో ఉన్న పటేల్‌ విగ్రహం వద్ద ఉంచారు. టోర్నమెంటులో పాల్గొనే పదిదేశాల జట్ల కెప్టెన్లు ఈ ట్రోఫీతో బుధవారం గ్రూప్‌ ఫొటో దిగారు. నిజానికి బుధవారం అట్టహాసంగా టోర్నమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్లాన్‌ చేసినా.. భద్రతా కారణాల రీత్యా రద్దు చేశారు. దీంతో ఈ టోర్నమెంట్‌ ప్రారంభ సూచికగా ప్రపంచకప్‌తో పది దేశాల జట్ల కెప్టెన్‌ల ఫొటో షూట్‌కు మాత్రమే పరిమితం చేశారు.


భారీ భద్రతా ఏర్పాట్లు


గురువారం నాటి తొలి మ్యాచ్‌కు గుజరాత్‌ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ఉన్న పోలీసులలో 30 శాతం.. అంటే సుమారు 3,500 మందిని స్టేడియం వద్ద మోహరింపజేస్తున్నారు. ఈ స్టేడియంలో 1,32,000 మంది కూర్చొనే వీలు ఉన్నది. అంటే.. ప్రతి 37 సీట్లకు ఒకరు చొప్పున పహారా కాయనున్నారు.


తొలి మ్యాచ్‌కు 85వేల సీట్లు నిండుతాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్టేడియం లోపల సివిల్‌ దుస్తుల్లో సోషల్‌మీడియా టీమ్‌ పనిచేస్తుందని పోలీసు అదికారులు తెలిపారు. వీళ్లు స్టేడియంలోనే ఉండి.. సోషల్‌ మీడియా పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. స్టేడియంలోకి వచ్చేవారికి మొబైల్‌ ఫోన్లు, పర్సులను మాత్రమే అనుమతిస్తారు.


మురికివాడ కనపడకుండా గోడ కట్టేశారు


మ్యాచ్‌లు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానున్న నేపథ్యంలో మోతేరా స్టేడియం పక్కన ఉన్న మురికి వాడ కనిపించకుండా ఏడు అడుగుల ఎత్తైన గోడను నిర్మించారు. గతంలో అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చిన సమయంలోనూ తాత్కాలికంగా ఒక గోడను అక్కడ నిర్మించిన సంగతి తెలిసిందే. స్టేడియం మార్గంలో ఉన్న ఆ మురికి వాడ కనిపించకుండా గోడలు కట్టడం గమనార్హం.


బీజేపీ ఉచిత టికెట్లు


మొత్తం 85వేల సీట్లు నిడుతాయని సిటీ పోలీసులు అంచనా వేస్తుంటే.. అందులో దాదాపు సగం.. అంటే 40 వేల టికెట్లను తొలి మ్యాచ్‌కు గాను బీజేపీ రాష్ట్ర శాఖ ఉచితంగా పంపిణీ చేసింది. ఈ టికెట్లన్నీ మహిళలకే ఇచ్చారు. ప్రతి వార్డు నుంచి 800 మంది చొప్పున ఎంపిక చేసి, అందజేశారు. క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న 20 మంది చిన్నారులకు, వారి డాక్టర్లకు కూడా మ్యాచ్‌ వీక్షించేందుకు అవకాశం కల్పించారు. వీరి కోసం స్టేడియంలో ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు.


పలువురు ప్రముఖులకు కూడా..


గోల్డెన్‌ పాస్‌ పేరిట పలువురు మాజీ క్రికెటర్లు, సినీ నటులకు కూడా అవకాశం ఇచ్చారు. వీరిలో అమితాబ్‌బచ్చన్‌, రజనీకాంత్‌, సచిన్‌ టెండూల్కర్‌ తదితరులు ఉన్నారు. తొలి మ్యాచ్‌ నుంచి ఫైనల్‌ దాకా టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్‌ను చూసే అవకాశం వీరికి కల్పించారు.


మోదీ స్టేడియంలో మ్యాచ్‌లు ఇవే

అక్టోబర్‌ 5 : ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌

అక్టోబర్‌ 14: ఇండియా- పాకిస్థాన్‌

నవంబర్‌ 4: ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌

నవంబర్‌ 10: ఆఫ్ఘనిస్థాన్‌ – సౌతాఫ్రికా

నవంబర్‌ 19: ఫైనల్‌.