కిక్కే.. కిక్కు.. ఫైన్‌లే ఫైన్లు.. ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం!

న్యూ ఇయర్‌కు భారీగా మద్యం అమ్మకం మెదక్ ఐఎంఎల్ డిపో ద్వారా 120 మద్యం షాపులకు, 13 బార్లకు సిద్దిపేట ఐఎంఎల్ డిపో ద్వారా 164 మద్యం షాపులు, 23 బార్లకు మద్యం సరఫరా.. 31న తాగి వాహనం నడిపి మొదటిసారి దొరికితే 10 వేల ఫైన్, 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు రెండవ సారి దొరికితే రూ.15వేలు.. 2 ఏండ్ల జైలు  విధాత, ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో: న్యూ ఇయర్ వేడుకలకు ఉమ్మడి […]

  • Publish Date - December 30, 2022 / 07:25 AM IST
  • న్యూ ఇయర్‌కు భారీగా మద్యం అమ్మకం
  • మెదక్ ఐఎంఎల్ డిపో ద్వారా 120 మద్యం షాపులకు, 13 బార్లకు
  • సిద్దిపేట ఐఎంఎల్ డిపో ద్వారా 164 మద్యం షాపులు, 23 బార్లకు మద్యం సరఫరా..
  • 31న తాగి వాహనం నడిపి మొదటిసారి దొరికితే 10 వేల ఫైన్, 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
  • రెండవ సారి దొరికితే రూ.15వేలు.. 2 ఏండ్ల జైలు

విధాత, ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో: న్యూ ఇయర్ వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధం అవుతోంది. మద్యం ప్రియులకు కోరినంత మద్యం సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మద్యం అమ్మకాలతో రికార్డు స్థాయి ఆదాయం పొందడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ, కఠినమైన ఆంక్షలు విధిచడం ద్వారా కూడా మరింత ఆదాయం పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే మద్యం ప్రియులారా బహుపరాక్..

కుర్రకారు కేరింతలు

కుర్రకారు కేరింతలు కొడుతూ డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు నూతన సంవత్సరానికి ఆహ్వనం పలుకుతారు. పార్టీల్లో ఉర్రూతలు ఊగుతూ రాత్రి ఆనందంగా గడుపుతారు. ఈ ఏడాది కోవిడ్ ఉన్నా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్ధిపేట పోలీస్ కమీషనరేట్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వేడుకలు నిర్వ‌హించుకునేందుకు భారీగా యువత సన్నద్ధమైంది.

శనివారం అర్ధ రాత్రి వేళ జరుపుకునే వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ఈవెంట్స్ సంస్థలకు పోలీసు అధికారులు ముందుగానే జరుపుకోవచ్చని సూచించారు. యువత అర్ధ‌ రాత్రి వేళ డ్రింక్ చేసి రోడ్లపై చిందులు వేస్తే కఠిన చర్యలతో పాటు ఫైన్లు, జైలు శిక్ష, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.

పట్టణాల శివారులలో..

పట్టణాల శివారులలో ఉన్న రిసార్ట్ లు, ఫాంహౌసుల్లో ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలు జరుపుకునేందుకు సన్నద్ధమయ్యాయి. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రిసార్ట్ లు, దాబాలల్లో వేడుకల నిర్వహించుకోవచ్చని తెలుపుతున్నారు. అనుమతులు లేకుండా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించవచ్చని పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో ఈవెంట్ల యజమానులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. స్పెషల్ ఈవెంట్ల పేరుతో ఎవరైనా డిసెంబర్ 31 అర్ధ రాత్రి వేడుకలు నిర్వహించుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. వైన్లకు బార్ల సమయం ప్రభుత్వం పొడిగించడంతో కోవిడ్ ఉన్నా ప్రజలు ఈ ఏడాది ఉత్సాహంగా సెలబ్రేషన్స్ చేసేకు నేందుకు ఉర్రూతలు ఊగుతున్నట్లు తెలుస్తోంది.

మోగనున్న ఫైన్ ల మోత

ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేందుకు పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. 31 రాత్రి మద్యం సేవించి వాహనం నడిపితే 10 వేల ఫైన్ తో బాటు 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఇక రెండవ సారి దొరికితే రూ.15 వేలు.. 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు డైవింగ్ లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొత్త ఆంగ్ల సంవత్సర ఈవెంట్లు, పబ్బులు. దాబాల్లో వేడుక జరుపుకోవచ్చని ప్రభుత్వం చెబుతుంటే.. పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.

పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే మేలు

డిసెంబరు 31వ రాత్రి పోలీసు అధికారులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. రాత్రి 1 గంట తర్వాత అనుమతి ఇవ్వమని చెబుతున్నా ఆచరణలో విఫలమవుతోంది. రాత్రి 11 గంటల నుంచి గస్తీ మమ్మురం చేయాలి. ఇళ్ల ముంగిట ముగ్గులు వేసుకొనే మహిళలకు ఆకతాయిల బెడద ఉంటుంది. వీటిపై గస్తీ పోలీసులు దృష్టి సారించాలి. అనుమతి లేకుండా వేడు కలు నిర్వహించే పార్టీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ దాడులు చేసి, కేసులు నమోదు చేయాలి. బైకులపై మద్యం మత్తులో జోగుతున్న యువతను నియంత్రించాలి. ఒక దశ సమయం తర్వాత పోలీసులు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు. ఏటా ఇది గమనిస్తునే ఉన్నాం. వీరి ఉదాసీనత కూడా ప్రమాదాలకు ఒక కారణమని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాల్లో మద్యం సరఫరా ఇలా..

మెదక్ ఉమ్మడి జిల్లాల్లో మద్యం సరఫరా మెదక్ , సిద్దిపేట ఐఎంఎల్ డిపోల ద్వారా మద్యం సరఫరా జరుగుతుంది. మెదక్ జిల్లా చిన్నగణపూర్ లో ఉన్న మద్యం డిపో ద్వారా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 120 మద్యం షాపులు 13 బార్లకు సరఫరా చేస్తున్నారు.

సిద్దిపేట ఐఎంఎల్ డిపో ద్వారా సిద్దిపేట, సిరిసిల్లా జిల్లాల్లోని 148 మద్యం షాపులకు, 23 బార్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. సిద్దిపేటకు సమీపంలో ఉన్న సిరిసిల్లా, చందుర్తి వరకు మద్యం సరఫరా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఎల్ డిపో ద్వారా అందిస్తున్నారు.