రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాలు ఖాళీ.. ఎన్నిక‌ల ఎఫెక్ట్‌తో జోరుగా అమ్మ‌కాలు

  • Publish Date - November 28, 2023 / 08:55 AM IST

విధాత‌: ఎన్నిక‌ల దెబ్బ‌కు రాష్ట్రంలోని మ‌ద్యం షాపుల‌న్నీ ఖాళీ అవుతున్నాయి. 30న పోలింగ్ నేప‌థ్యంలో నేడు ప్ర‌చారం ముగిసే సాయంత్రం 5 గంట‌ల నుంచి పోలింగ్ ముగిసేంత వ‌ర‌కూ రాష్ట్రంలోని అన్ని మ‌ద్యం దుకాణాలు మూసివేయ‌నున్నారు.


ఈ నేప‌థ్యంలో మందుబాబులు రిజ‌ర్వ్ స‌రుకు కొనేందుకు పోటీలు ప‌డుతుండ‌టంతో వైన్స్ లో స‌రుకు అయిపోతున్న‌ది. చాలా చోట్ల ఫుల్ బాటిళ్లు సైతం దొర‌క‌డం లేదు. క్వార్ట‌ర్ బాటిళ్లు, చీప్ లిక్క‌ర్ 90 బాటిళ్లు మాత్రం అది కూడా అర‌కొర క‌నిపిస్తున్నాయి. 

దీనికి తోడు రాజయ నాయ‌కులు సైతం పెద్ద మొత్తంలో కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌డానికి కొనుగోలు చేయ‌డంతో దాదాపు అన్ని దుకాణాలు సోమ‌వారం రాత్రికే ఖాళీగా క‌నిపించాయి. ఆదివారం ఒక్క రోజే ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌కుపైగా అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని దుకాణ‌దారులు చెబుతున్నారు.

సోమ‌వారం అది కూడా దాటిపోయి ఉంటుంద‌ని అంటున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం కాదు క‌దా.. మ‌ధ్యాహ్న‌మే దుకాణం స‌రుకు లేక బంద్ చేయాల్సి వ‌స్తుందేమోన‌ని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉన్న‌ద‌ని వారు పేర్కొంటున్నారు. ఎంతైనా మందుబాబులా మ‌జాకానా.