న్యూఢిల్లీ : 2023 సంవత్సరంలో ఇండియాలోని అమెరికా కాన్సులార్ బృందం రికార్డు స్థాయిలో 14 లక్షల వీసాలు జారీ చేసింది. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో వీసాలు మంజూరు కాలేదు. అంతేకాదు.. విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూసే సమయాన్ని 75 శాతం తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసాకోసం దరఖాస్తు చేసుకునేవారిలో ఒకరు భారతీయులేనని అమెరికా ఎంబసీ, కాన్సులేట్ వర్గాలు తెలిపాయి. ‘2023లో భారత్‌లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్లు రికార్డు స్థాయిలో 14 లక్షల అమెరికా వీసాలను ప్రాసెస్ చేశాయి. అన్నిరకాల వీసాల్లోనూ డిమాండ్ మునుపెన్నడూ లేనంత ఉన్నది. 2022తో పోల్చితే దరఖాస్తులు 60 శాతం పెరిగాయి’ అని ఒక ప్రకటనలో తెలిపాయి. దరఖాస్తుల్లో విజిటర్ వీసాలు (బీ1/బీ2) ఏడు లక్షలు ఉన్నాయని, ఇది ఎంబసీ చరిత్రలోనే లేని విషయమని పేర్కొన్నాయి. విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ కోసం గతంలో వెయ్యి రోజులు ఎదురు చూసే పరిస్థితి ఉంటే.. ఇప్పుడు అది 250 రోజులకు తగ్గిపోయిందని తెలిపాయి. ఇతర క్యాటగిరీల్లో సైతం స్వల్ప సమయంలోనే వీసా అపాయింట్‌మెంట్‌లు లభ్యమవుతున్నాయి.
2023లో విద్యార్థి వీసాలు 1.40 లక్షలు ఇచ్చినట్టు యూఎస్ దౌత్య కార్యాలయం పేర్కొన్నది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత సంఖ్యలో అమెరికా విద్యార్థి వీసాలు ఇవ్వలేదని తెలిపింది. ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై.. ఈ నాలుగు నగరాల్లోని వీసా జారీ కేంద్రాలు ప్రపంచంలోనే అధిక సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేస్తున్నాయని పేర్కొన్నది. అమెరికాలో చదువుకుంటున్న ఇతర దేశాల విద్యార్థుల్లో అత్యధికులు భారతీయ విద్యార్థులేనని తెలిపింది. అమెరికాలో సుమారు పది లక్షల మంది ఇతర దేశాల విద్యార్థులు చదువుకుంటున్నట్టు అంచనా. వారిలో నాలుగో వంతు భారతీయులే. ఉపాధి వీసాకు కూడా టాప్ ప్రయారిటీ ఉన్నదని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. చెన్నై, హైదరాబాద్ కార్యాలయాల్లో ప్రాసెసింగ్ వేగవంతం కావడంతో గత ఏడాది 3,80,000కుపైగా ఎంప్లాయిమెంట్ వీసాలు జారీ చేసినట్టు తెలిపింది. దీనితోపాటు అర్హులైన హెచ్1బీ వీసాదారులు వాటిని రెన్యువల్ చేయించుకునేందుకు పైలట్ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు.