విధాత : కుటుంబ పార్టీలు కాంగ్రెస్, బీఆరెస్, ఎంఐఎంలతో ప్రజాధనం లూటీ జరిగి అవినీతి పాలన సాగుతుందని, దేశంలో, రాష్ట్రంలో బీజేపీతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెసక్లబ్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్ వాళ్లని గెలిపిస్తే వెళ్లి బీఆరెస్‌లో కలుస్తారని, బీఆరెస్ వాళ్లను గెలిపిస్తే ప్రజల సొమ్మును లూటీ చేస్తారన్నారు.
తెలంగాణలో భూముల వేలంలో 4వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్, మియాపూర్ భూములు, గ్రానైట్, మనీ లాండరింగ్ వంటి వాటిలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భారీగా కుంభకోణం జరిగిందన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. పేపర్లో లీక్‌తో కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు.
నిరుద్యోగులకు 3,000భృతి ఇస్తామని చెప్పి చేయలేదన్నారు. ఫార్మా సిటీ, విద్యా సిటీ, టెక్స్ టైల్స్ పార్క్.. ఎక్కడని ప్రశ్నించారు. నాలుగు మల్టీస్పెషల్ ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పి చేయలేదన్నారు. బీఆరెస్ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు పథకాలు వస్తున్నాయని అమిత్‌షా తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం కూడా నిర్వహించడం లేదని, ఎంఐఎంకు భయపడి ముస్లిం రిజర్వేషన్లు కల్పించారన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. వరికి క్వింటాల్ 3100 చెల్లిస్తామన్నారు. పెట్రోల్ డీజిల్ పై అన్ని రాష్ట్రాలు వాటి తగ్గిస్తే కేసీఆర్ తగ్గించలేదన్నారు. కేంద్ర నిధులపై సీఎం కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణకు తొమ్మిదేళ్లలో 2.5లక్షల కోట్ల నిధులిచ్చామని, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి 900కోట్లు మంజూరీ చేశామన్నారు.
దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసిందని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని, ఆడపిల్లల పేరు మీద రెండు లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు, బీసీ సీఎంకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా మాదిగ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందని అమిత్ షా పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేయటం కోసం కేంద్ర కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
ఇంట్లో కూర్చుని ప్రభుత్వాన్ని నడిపేవారికి పరిపాలన ఏం తెలుసని ప్రశ్నించారు. సీఎం ఫాంహౌస్‌లో కాదని, సచివాలయంలో ఉండాలన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా అమిత్ షా మార్చారన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం అవినీతిపై విచారణ జరిపి అవినీతి పరులను జైలుకు పంపుతామని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ప్రస్తుత పథకాలను కొనసాగిస్తామన్నారు.