Rajasthan
విధాత: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల మృత్యు ఘోష ఆగడం లేదు. జాతీయ పోటీల పరీక్షల కోచింగ్ కేంద్రమైన కోటా నగరంలో మరొకరు మరణించారు. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రాన్స్ టెస్ట్ (నీట్)కు ప్రిపేర్ అవుతున్న రిచా సిన్హా (16) మంగళవారం రాత్రి తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విజ్ఞన్‌నగర్‌లోని తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకోగా, గమనించిన తోటి విద్యార్థిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. విద్యార్థిని అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు వెల్లడించారు.
జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన రిచాసిన్హా 11వ తరగతి విద్యార్థిని. ఆమె కోటాలోని ఒక కోచింగ్ సెంటర్‌లోఈ ఏడాది ఫిబ్రవరిలో చేరింది. నీట్‌కు ప్రిపేర్ అవుతున్నది. ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. అయితే, గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంబీఎస్ దవాఖానకు తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది కోటా నగరంలో ఇప్పటివరకు 23 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత ఏడాది 15 మంది నీట్ అభ్యర్థులు సూసైడ్ చేసుకున్నారు.