విధాత: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి మరికొన్ని నిమిషాల్లో తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. సీఎంగా రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరితో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే గచ్చిబౌళిలోని ఎల్లా హోటల్‌లో బస చేసిన గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది హాజరవుతారని అంచనా.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులకు కూడా ఆహ్వానం అందించారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చే ఫైల్‌పై సంతకం చేయనున్నారు. ఎన్నికైన ముఖ్యమంత్రి 38 ఏళ్ల మహిళకు మొదటి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.