విధాత : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లను 2750రూపాయల నుంచి 3వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన పెన్షన్ జనవరి నుంచి అమల్లోకి రానుంది. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన భేటీయైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జననన్న ఆరోగ్య సురక్ష రెండో విడతను, వైఎస్సార్ అసరా, చేయూత పథకాలను జనవరి నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ చికిత్స పరిమితిని రూ.25 లక్షల పెంచింది. సామాజిక పెన్షన్లు రూ.3 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది.
విశాఖలోని 4 కారిడార్లలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం తెలిపింది. కుల, ఆదాయ ధృవీకణ ప్రతాల మంజూరులో సంస్కరణలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురంలో వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధురవాడలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థకు 11 ఎకరాలు కేటాయిస్తు నిర్ణయం తీసుకుంది. మిచౌంగ్ తుఫాన్ నష్టపరిహారం చెల్లింపుకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 45అంశాలపై కేబినెట్ చర్చించింది.