న్యూఢిల్లీ : భారత్‌లో లభ్యమవుతున్న కోడి గుడ్లు సురక్షితమైన ఆహారమేనని..ప్రజలు నిరభ్యంతరంగా తినొచ్చని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పష్టం చేసింది. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ జీవక్రియా ఉత్పన్నాలు (AOZ) అనే క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఓ ప్రకటనలో స్పష్టత నిచ్చింది. గుడ్డులో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు ఇప్పటి వరకు శాస్త్రీయంగా నిరూపితం కాలేదని వెల్లడించింది. అనవసర అపొహలు, ఊహగానాలను విశ్వసించవద్దని తెలిపింది.
దేశంలో లభించే గుడ్లు మానవ వినియోగానికి సురక్షితమైనవని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. గుడ్ల నాణ్యతపై వస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేవని, వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కొట్టిపారేసింది. 2011 ఆహార భద్రతా నిబంధనల ప్రకారం కోళ్ల పరిశ్రమలో, గుడ్ల ఉత్పత్తిలో ఏ దశలోనూ నైట్రోఫ్యూరాన్‌ల వాడకాన్ని కఠినంగా నిషేధించినట్లు గుర్తుచేసింది. నైట్రోఫ్యూరాన్‌కు కిలోకు 1.0 మైక్రోగ్రామ్ పరిమితి ఉందని, ఇది ప్రయోగశాలల్లో గుర్తించగల అతి తక్కువ స్థాయి అని అధికారులు వివరించారు. ఈ పరిమితి కంటే తక్కువగా అవశేషాలు కనుగొనడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని, అది నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
England vs Australia : యాషెస్..మూడో టెస్టులో ఓటమి దిశగా ఇంగ్లాండ్
UTI : యూరిన్ కంట్రోల్ చేసుకుంటే ప్రాణాలకే ముప్పు!
