UTI : యూరిన్ కంట్రోల్ చేసుకుంటే ప్రాణాలకే ముప్పు!

మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. యూటీఐ (UTI) ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే అది కిడ్నీలు దెబ్బతినడానికి, మరణానికి ఎలా దారితీస్తుందో చూడండి.

Urinary Tract Infection

విధాత : తరచూ మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉన్న ఓ 28ఏళ్ల కార్పోరెట్ మహిళా ఉద్యోగి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) తో మరణించారు. ఆఫీస్ కు వెళ్లే క్రమంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ప్రయాణించేటప్పుడు మూత్రాన్ని ఎక్కువగా ఆపుకోవడం వల్ల ఆమె రక్తంలో ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయికి చేరిందని ఒక డాక్టర్ సోషల్ మీడియాలో తెలిపారు. చికిత్స కోసం వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపించిందని, అప్పటికే పరిస్థితి విషమించిందని, కాపాడలేకపోయానని వివరించారు. కేవలం నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని, మహిళలు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూత్రాన్ని( యూరిన్) కంట్రోల్ చేసుకుంటే ప్రాణాలకు ముప్పు అనే విషయాన్ని ఈ సందర్బంగా వైద్యులు గుర్తు చేస్తున్నారు.

ఏటా కోటిన్నర మందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

అమెరికాలో ప్రతీ ఏటా రెండున్నర లక్షల మందిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది ఈ వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నారు. ఓ పరిశోధన ప్రకారం మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు రావడానికి 60 శాతం అవకాశం ఉంది. పురుషుల్లో 13 శాతం ఉంది. మహిళకు బ్యాక్టీరియా సోకినప్పుడు, బ్యాక్టీరియా మూత్రాశయంలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతాయి. మూత్రనాళం పొడవు తక్కువైనందున బ్యాక్టీరియా అక్కడికి చేరుకోవడం సులభం. అందుకే పురుషుల కంటే స్త్రీలతో యూటీఐ సమస్య ఎక్కువగా ఉంటుంది. యూరినరీ బ్లాడర్‌లో మంటను వైద్య పరిభాషలో సిస్టిటిస్ అంటున్నారు. దీన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ( UTI) అని పిలుస్తున్నారు. చాలా కేసుల్లో ఇన్ఫెక్షన్ వల్ల లేదా బ్యాక్టీరియాతో వచ్చే ఇన్పెక్షన్ల విస్తరణ వల్ల ఈ వ్యాధి వస్తుంది. మూత్రాశయం లేదా మూత్రాశయ ట్యూబ్‌కి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి పెద్ద వయసు వారిలో ఎవరికైనా ఇది సోకవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

లక్షణాలను గుర్తించడం ఎలా?

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏ వయసు వారికైనా రావచ్చు. కడుపునొప్పితో పాటు మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంటగా, నొప్పిగా అనిపించడం.. మూత్రంలో కొద్దిగా రక్తం కూడా రావడం లక్షణాలుగా కనిపిస్తుంటాయి. తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు యోని చర్మంపై మంటలు, మూత్రంలో రక్తం రావడం వంటి లక్షణాలు సమస్యను వెల్లడిస్తాయి. చాలాకాలం పాటు వీటిని నిర్లక్ష్యం చేసే మహిళల్లో అధిక జ్వరం కూడా ఒక లక్షణం కావచ్చు. తక్కువ నీరు త్రాగే మహిళల్లో ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఎక్కువ సేపు మూత్ర విసర్జన చేయకుండా బిగబట్టుకునే వారిలోనూ ఈ ఇన్ఫెక్షన్ అధికం. మూత్రం ఆపుకోవడంతో బ్యాక్టీరియా పేరుకు పోయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారీన పడుతున్నారు. తరచుగా అండర్ గార్మెంట్స్ మార్చుకోని వారికి, మధుమేహం ఉన్న మహిళలకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో యూటీఐ సంక్రమించవచ్చని, రుతుక్రమం తర్వాత కూడా యూటీఐ సోకవచ్చు అని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆ సమయంలో యోనిలో వ్యాధి నిరోధక బ్యాక్టీరియాల సంఖ్య తగ్గుతుండటమే అందుకు కారణమని గుర్తించారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే, అది కిడ్నీలకు వ్యాపిస్తుంది. ఈ- కొలి బ్యాక్టీరియా వల్ల కూడా యూటీఐ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇదే కాక ఇతర బ్యాక్టీరియా కూడా ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు అని తెలిపారు.
కనీసం 10 శాతం మంది స్త్రీలకు ఒకసారి సిస్టిటిస్‌ వస్తుందని.. వారిలో సగం మందికి మళ్లీ వస్తోందని..యూటీఐ లక్షణాలు కనిపిస్తే స్త్రీలు గైనకాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

యూటీఐ ఇన్ఫెక్షన్ ఎలా నివారించాలి ?

వైద్యులు సూచించకుండా యూటీఐ ఇన్ఫెక్షన్ నివారణకు ఎలాంటి యాంటీబయాటిక్స్ తీసుకోవద్దని, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆహారంపై శ్రద్ధ వహించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. యూటీఐ రాకుండా ఉండేందుకు
నీరు బాగా తాగాలని.. రోజుకు కనీసం రెండు మూడు లీటర్ల నీరు తాగాలని చెబుతున్నారు. పురుషులతో సెక్స్ చేసేటప్పుడు కండోమ్‌లను తప్పకుండా వాడాలని, కండోమ్‌లు ఉపయోగించలేని మహిళలు సెక్స్ చేసిన వెంటనే మూత్ర విసర్జన చేయాలని..సెక్స్ తర్వాత ప్రైవేట్ భాగాలను నీటితో కడుక్కోవాలని, యోనిని పరిశుభ్రపరిచే ఉత్పత్తుల్ని వాడకపోవడమే మంచిదని, పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించే ముందు, టాయిలెట్ షీట్ ను సాధారణ నీటితో కడగాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

India T20 World Cup squad| టీ 20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన..గిల్ ఔట్
8000 Applicants For Home Guard Post : నిరుద్యోగం ఎఫెక్ట్…హోంగార్డు పోస్టులకు పీజీ నిరుద్యోగుల క్యూలైన్స్!

Latest News