వైసీపీ బలాలు, బలహీనతలు..
తెలుగుదేశం బలాలు, బలహీనతలు
2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి ఏపీలో ఎదురీత మొదలైందా? సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్.. అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం మధ్య తరగతి, బుద్ధిజీవుల మద్దతును ఆ పార్టీకి దూరం చేసిందా? గ్రామ సచివాలయాలు, వలంటీర్లతో వైసీపీ క్యాడర్‌కు ప్రజలతో సంబంధం లేకుండా చేసిన విధానం ఆ పార్టీ క్యాడర్‌లో అసంతృప్తికి కారణమైందా? సీపీఎస్ రద్దు చేయకపోవడమేకాదు, పెండింగ్ డీఏలను కూడా సకాలంలో చెల్లించలేని స్థితిపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఫ్యాన్‌కు వ్యతిరేకంగా మార్చిందా? వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల భూ దందాలు, అరాచకాలు ఆ పార్టీపై తటస్థుల్లో కూడా వ్యతిరేకతకు బీజం వేశాయా? ఎమ్మెల్యేలకేకాదు, మంత్రులకు సైతం అందనంత దూరంలో సీఎం కార్యాలయం ఉండటం సొంత నాయకులకే విరక్తి కలిగించిందా? నాసిరకం మద్యంతో మందుబాబుల మనోభావాలను గాయపరిచిన జగన్ పార్టీకి ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని శపథం చేసేంత స్థాయిలో కసి పెంచిందా? ఏపీ రాజకీయాలపై వస్తున్న సర్వేలు.. నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. (విధాత ప్రత్యేకం)
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటలను సైతం బద్ధలుకొట్టి విజయ బావుటాలు రెపరెపాలాడించిన ఫ్యాన్ స్పీడుకు.. ఇప్పుడు లో ఓల్టేజ్ సమస్య వచ్చిపడిందంటున్నాయి సర్వేలు. గత ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం తెలుగుదేశం తన బలాన్ని అనూహ్యంగా పెంచుకుంటున్నట్లు వస్తున్న సర్వే ఫలితాలు వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నాయంటున్నారు.
అమరావతి రాజధాని మార్పుతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈసారి వైసీపీ ఏటికి ఎదురీతక తప్పని పరిస్థితి నెలకొందని సర్వేల సారాంశం. ఒకప్పటి తెలుగుదేశం కంచుకోట ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లకు 12 ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లను కైవసం చేసుకున్న జగన్ పార్టీకి ఈసారి ఫలితాలు తారుమారు అవుతాయని చెబుతున్నారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం వైసీపీ-టీడీపీ మధ్య పోటా పోటీ ఉంటుందని చెబుతున్నా, జనసేనతో పొత్తు కుదిరితే మాత్రం ఈ జిల్లాల్లోనూ టీడీపీ కూటమి లాభపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందని, తెలుగుదేశం పార్టీ ఇంకా బలహీనంగానే ఉందని చెబుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతుండగా, ఎన్నికల నాటికి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కాపులు ఈసారి అటు టీడీపీ, ఇటు వైసీపీని కాదని అనూహ్యంగా జనసేన పక్షానికి మళ్లుతున్నట్టు తెలుస్తున్నది. పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో కాపులు వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు.
జగన్, బీజేపీ మధ్య సహృద్భావ వాతావరణం ఉందని టీడీపీ, జనసేన ఎంతగా ప్రచారం చేస్తున్నా.. మైనార్టీలు మాత్రం జగన్‌కే జై అంటున్నారు. ఇక టీడీపీకి వెన్నెముకగా చెప్పుకొంటున్న బీసీలు గత ఎన్నికల్లో భారీగా వైసీపీవైపు వెళ్లిపోయారు. వారంతా తిరిగి టీడీపీకి వచ్చే వాతావరణం ఇప్పట్లో కనిపించక పోగా, బీసీల్లో సంక్షేమ పథకాల కారణంగా జగన్‌పై ఆదరణ ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, ఉపాధ్యాయుల్లో మాత్రం జగన్ ప్రభుత్వం పట్ల లోలోపల తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానన్న జగన్.. మాట తప్పడంపై ఆ వర్గాలు మండిపడుతున్నాయి.
ఏపీలో సరఫరా అవుతున్న మద్యం నాసిరకం కావడం, రేట్లు ప్రీమియం బ్రాండ్లకు ఏమాత్రం తీసిపోకపోవడంతో మందుబాబులు కూడా జగన్ ప్రభుత్వాన్ని దింపేందుకు శపథాలు చేస్తున్నట్లు సర్వేల్లో వ్యక్తమైంది. గ్రామాల్లో వైసీపీకి వెన్నెముకగా ఉన్న రెడ్లు కూడా జగన్ ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను ఏర్పాటు చేశాక, లబ్ధిదారులకు ఏ నాయకుడి సిఫారసు అవసరం లేకుండానే సంక్షేమ పథకాలు బ్యాంకు అకౌంట్లలో వచ్చి పడుతున్నాయి. దీంతో గ్రామ, మండల స్థాయి నేతలను ఓటర్లు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు.
దాంతో వారు కొంత అసహనంగా ఉంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వారు ఆసక్తి చూపించే పరిస్థితి ఏమాత్రం లేదని ఈ సర్వేలో తేలింది.
తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తే జగన్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ఒకవేళ వారు విడివిడిగా పోటీ చేస్తే మాత్రం మళ్లీ జగన్‌కే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. అయితే సుమారు పది శాతం మంది ప్రజలు ఏ సర్వే సంస్థ ముందు నోరు విప్పడం లేదని, వారు సంక్షేమ పథకాలు పోతాయనే భయంతో ఏమీ మాట్లాడటం లేదని సర్వే సంస్థలు అంచనాకు వచ్చాయి. వారు ఎటు మొగ్గు చూపుతారనే విషయం నిర్ధారణకు రాలేకపోతున్నామని అంటున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా? నేనా? అన్న స్థాయిలో పోరుసాగితే.. ఈ పదిశాతం మంది కింగ్‌మేకర్లు అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.