AP | కేంద్రాన్ని ప్రశ్నించే పార్టీ.. ఏపీలో ఏది?

AP నిలదీసే శక్తిని కోల్పోతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్ని రాజకీయ పార్టీల పాకులాట బీజేపీ ప్రాపకం కోసమే! మాటలే తప్ప.. కేంద్రం చర్యలపై ఒక్క పోరాటమూ లేదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించే గొంతులేవి? విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సాధించే సత్తా లేదా? రాజకీయ పార్టీల సోదిలో లేని విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌ ఏండ్ల తరబడి పోలవరం ప్రాజెక్టు నడుస్తున్నా అడిగేదెవరు? తనపై కేసుల విషయంలో భయపడుతున్న ముఖ్యమంత్రి జగన్‌ […]

  • Publish Date - April 27, 2023 / 02:58 PM IST

AP

  • నిలదీసే శక్తిని కోల్పోతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
  • అన్ని రాజకీయ పార్టీల పాకులాట బీజేపీ ప్రాపకం కోసమే!
  • మాటలే తప్ప.. కేంద్రం చర్యలపై ఒక్క పోరాటమూ లేదు
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించే గొంతులేవి?
  • విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సాధించే సత్తా లేదా?
  • రాజకీయ పార్టీల సోదిలో లేని విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌
  • ఏండ్ల తరబడి పోలవరం ప్రాజెక్టు నడుస్తున్నా అడిగేదెవరు?
  • తనపై కేసుల విషయంలో భయపడుతున్న ముఖ్యమంత్రి జగన్‌
  • ఏదోలా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు తాపత్రయం
  • బీజేపీ అండతో అధికారం సాధించుకునే కలలో పవన్‌కల్యాణ్‌
  • అధికార యావే తప్ప.. బీజేపీ అరాచకాలను నిలదీయలేని స్థితి
  • రావాల్సిన అంశాలు సాధించుకునేందుకు చొరవ చేయలేని దీనం

ఏండ్ల తరబడి పోలవరం ప్రాజెక్టు నత్త నడకన సాగుతూనే ఉన్నది! కానీ ఏపీలోని ఏ రాజకీయ పార్టీ దీనిని ప్రశ్నిస్తున్నది? ప్రత్యేక హోదా అటకెక్కిపోయినా పోరాడే సాహసం ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు చేయలేక పోతున్నది? విశాఖ ఉక్కును అమ్మేస్తానని కేంద్రం జబ్బలు చరిస్తే గొణుగుడు తప్ప ఢీ అంటే ఢీ అని అధికార, ప్రతిపక్షా పార్టీలు ఎందుకు సవాలు చేయలేక పోతున్నాయి? ఏపీ రాజకీయాలకు ఏమైంది? బీజేపీ ప్రాపకం కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాయి? ఎందుకు అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి?

విధాత: ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అస్థిత్వాన్ని కోల్పోతున్నాయా? తమకు కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై కొట్లాడి సాధించుకునేది పక్కన పెడితే.. కనీసం విన్నపాలైనా చేసుకోలేని దుస్థితిలో ఉన్నాయా? బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్నాయా? అనే ప్రశ్నలకు ఔననే అంటున్నారు ఏపీలోని రాజకీయ పరిశీలకులు. అందులో పడిపోయి.. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించే శక్తి కోల్పోతున్నాయని చెబుతున్నారు.

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించి, పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫాక్టరీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు తహతహలాడుతున్నా అధికార ప్రతిపక్ష పార్టీలు దానిని గట్టిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ప్రైవేటీకరణలో భాగంగా బిడ్డింగ్‌కు పిలిస్తే కనీసం నిరసన వ్యక్తం చేయలేని దుస్థితికి అవి దిగజారాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలో అధికార పక్షంగా వైఎస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంటే.. జనసభల్లో ప్రజా మద్దతు తప్ప.. చట్టసభల్లో ప్రజా మద్దతు సాధించలేక పోయిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన మరో ప్రతిపక్షంగా ఉన్నది. బీజేపీకి ఏపీలో పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ లేదు.

ys jaganmohan reddy

బీజేపీని వదిలేస్తే.. ఈ మూడు పార్టీల మధ్య నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు, సెల్ఫీ చాలెంజ్‌లు, పిట్టకథలు అన్నట్టు సాగుతున్నది. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలన్న ఆశతో వైఎస్సార్‌సీపీ ఉంటే.. ఈసారి గెలవకపోతే మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని టీడీపీ భావిస్తున్నది.

ఇక జనం మద్దతు బ్రహ్మాండంగా ఉందని నమ్ముకుంటున్న జనసేన సైతం సీఎం పీఠంపై ఆశను కోల్పోవడం లేదు. అధికారం సాధించడంపై ఉన్న యావ.. ఈ పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంపై, కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరేలా చూడటంపై ఉన్నదా? అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో టీడీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నిజానికి అప్పటి నుంచే ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తూ వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పోలవరం పేరుతో తెలంగాణకు చెందిన 7 మండలాలను కేంద్ర ప్రభుత్వం ఏపీలో కలిపేసింది.

ఇక పోలవరం వేగంగా పూర్తయిపోతుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదు. విచిత్రమో.. లేక రాష్ట్రానికి పట్టిన రాజకీయ దరిద్రమో తెలియదు కానీ విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోలేని దుస్థితి ఏపీకి వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

సహజంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్రానికి అన్యాయం చేసినట్టయితే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు సహజంగానే పోరాటాలకు దిగుతాయి. కానీ.. ఏపీలో పోరాటాలు లేకపోగా.. కనీసం అడగలేని దుస్థితి ఈ పార్టీలకు ఎందుకు వచ్చిందని ఒక రాజకీయ పరిశీలకుడు తన బాధను వ్యక్తం చేశారు.

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu. (Photo: IANS)

ఏపీ(AP)కి ప్రత్యేక హోదా తీసుకురావడంలో నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత విఫలమయ్యారని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయి విమర్శలతో చెలరేగారు. తాను అధికారంలోకి వస్తే హోదా సాధిస్తానని ప్రతినబూనాను. ఇదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించారు.

విచిత్రం ఏమిటంటే.. తన తొలి ఢిల్లీ పర్యటన తర్వాతే ఆయన ఈ అంశంపై చేతులెత్తేశారు. కేంద్రం ఇవ్వనంటున్నది.. ఇచ్చేదాకా అడుగతూనే ఉంటామని చెప్పినా.. ఆ తర్వాత అది అటకెక్కింది. ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం చంద్రబాబు కూడా చేయడం లేదు. పోనీ రేపొద్దున్న ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రత్యేక రాష్ట్ర హోదా సాధిస్తామని చెబుతారా అంటే అదీ లేదు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ఊసే ఎవరూ ఎత్తడం లేదు. ఆస్తుల విభజనపైనా నోరు మెదపడం లేదు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా ఆపితే నిలదీసే సాహసం అధికార, ప్రతిపక్ష పార్టీలేవీ చేయడం లేదు. విభజన చట్టంలో హామీగా ఉన్న పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. సకాలంలో నిధులు విడుదల చేస్తే 2021 డిసెంబర్‌లోనే పూర్తయ్యేది. కానీ నిధులు విడుదలకు సవాలక్ష కారణాలు చెబుతుండటంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయా? లేదా? అన్న స్థితికి చేరుకున్నాయి. అయినా దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ఎవరికీ ధైర్యం లేదు.

ద్రవ్యలోటు పూడ్చడానికి ఏపీ(AP)కి రూ. 25 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉండగా, రూ.12 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన నిధులను ఎవరు అడగాలి? రాష్ట్ర ప్రభుత్వం అడగదు. ప్రతిపక్షాలకు పట్టదు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంట్‌ కేంద్రం విడుదల చేయకపోయినా మాట్లాడేవారు లేరు.

బీజేపీ ప్రాపకం కోసం ఎదురు చూస్తున్న అధికార, విపక్ష పార్టీలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు అడగడం మాని బీజేపీ ప్రాపకం కోసం ఎదురు చూస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న అధికార పార్టీని ప్రశ్నిస్తే తనపై ఉన్న కేసులకు చలనం వచ్చి వేగంగా తనను చుట్టుముడతాయన్న భయం సీఎం జగన్‌లో ఉండి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే కేంద్రంలో కయ్యానికి జగన్‌ సిద్ధంగా లేరని చెబుతున్నారు.

ఇక చంద్రబాబునాయుడు ఈసారి కూడా మోదీ హవా ఉంటే ఆ గాలిలో తన సైకిల్‌ వేగంగా తొక్కొచ్చన్న ఫీలింగ్‌లో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి వేదికపై నరేంద్ర మోదీని కీర్తించే పనిని నెత్తికెత్తుకోవడం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్‌ కల్యాణ్ పార్టీ కూడా బీజేపీతో అంటకాగే ఉద్దేశంతోనే ఉన్నది. అందుకే విభజన హామీలపై ఏపీలోని అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒకవైపు పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు కేంద్రం నుంచి జరుగుతున్న అన్యాయాలపై నిగ్గదీస్తున్నా.. అందులో కనీసం వంతుగానైనా తమ రాష్ట్రం కోసం ఏపీ పార్టీలు ఆలోచించడం లేదని అంటున్నారు.

ఏపీ ప్రజల ప్రయోజనాలకు ఈపార్టీలు ఏమాత్రం పట్టించుకునే స్ఠితిలో లేవని, అందుకే ప్రజల సమస్యల స్థానంలో కేసులు, సీబీఐ విచారణలు, హత్య కేసు విచరణల అంశాలే ఎజెండాగా ఇక్కడి పార్టీలు రాజకీయ ప్రచారం చేస్తున్నాయని ఒక పార్టీ నేత ఆవేదన వ్యక్తం చేశాడు…పక్క రాష్ట్రమైన తెలంగాణలో రాష్ట్రసమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తుంటే ఇక్కడి నేతలు మాత్రం బీజేపీ దగ్గర ప్రాపకం పొందే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.