విధాత: బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని నిజామాబాద్(Nizamabad) ఎంపీ(MP) ధర్మపురం అర్వింద్(Dharmapuri Arvind) స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. సంజయ్ బీఆర్‌ఎస్‌కు ఆయుధంగా మారాడని, ఆయన వ్యాఖ్యలతో బీజేపీ(BJP)కి సంబంధం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
అర్వింద్ పరోక్ష ప్రస్తావన..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే పవర్ సెంటర్ కాదని, అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత అది అన్నారు. బీఆర్‌ఎస్ నేతలపై ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, కవితలపై ఒంటికాలిపై లేచే అర్వింద్ కూడా కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను తన మాటల ద్వారా పరోక్షంగా ప్రస్తావించారు.
ఆత్మరక్షణలో బీజేపీ నేతలు..
దీన్నిబట్టి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీకి ఎంత నష్టం చేశాయో, బీఆర్‌ఎస్‌కు ఎంత మేలు చేశాయో ఆయన మాటల ద్వారా స్పష్టమైంది. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిచిన ఆ పార్టీ తిరిగి ఆ స్థానాలు నిలబెట్టుకుంటే చాలు అనుకుంటున్నసమయంలోనే అమిత్‌షా తెలంగాణలో గెలిచి తీరాల్సిందేనని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కానీ సంజయ్ వ్యాఖ్యల తర్వాత చాలామంది బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారు.
బహిరంగంగానే సంజయ్‌పై విమర్శలు..
ఒకరిద్దరు మహిళా నేతలు ఆయన వ్యాఖ్యలను మీడియా వేదికగా సమర్థిస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఒక ఆట ఆడుకున్నది. కొత్త, పాత అని తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని అమిత్ షా అంటే.. పార్టీ అధ్యక్షుడు అంటే పవర్ సెంటర్ కాదని, అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఏకపక్ష వైఖరి వల్ల పార్టీలో అసంతృప్తి నెలకొన్నదని, అప్పుడప్పుడు కొంతమంది నేతలు బహిరంగంగానే సంజయ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా అర్వింద్ వ్యాఖ్యలు దానికి బలం చేకూరుస్తున్నాయి.
నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య…
సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే లీకులు ఇచ్చింది. ఈ సమయంలోనే ఆయన కవితపై అనుచిత వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీకి తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉన్నది. దాదాపు 50-60 స్థానాలకు సరైన అభ్యర్థులే లేరు.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో అధికారం సంగతి ఏమో గాని తమ ఓట్లకు ఎక్కడ గండి పడుతుందో అన్న ఆందోళన చాలామంది నేతల్లో మొదలైంది. అందుకే ఎన్నికల ఏడాది కాబట్టి ఆ ప్రభావం తమపై ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన ప్రచారానికి వస్తే గెలుపు సంగతి పక్కనపెడితే డిపాజిట్లు కూడా వస్తాయో లేదో అన్న అనుమానాలు కూడా చాలామంది నేతల్లో ఉన్నది.