విధాత: తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో అపరిష్కృత ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నించారు.
పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకొని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట సాగింది. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడారు.
గత 8 సంవత్సరాలుగా నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో ముట్టడికి వెళుతుండగా పోలీసులు మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించడం అప్రజాస్వామికమన్నారు. తమ పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుకను ఉదయమే ఇంటి వద్దనే ముందస్తు అరెస్టు చేశారన్నారు.
మా నాయకులను అనేక మందిని మార్గమధ్యంలో అడ్డుకున్నారని, అభివృద్ధి చేయమని అడిగితే అక్రమ అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. కేసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిని పరుగులు తీయిస్తానని చెప్పి, బంగారు తెలంగాణ చేస్తామని తుంగతుర్తిలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
ముఖ్యంగా అంతర్గత రోడ్లు గతుకుల మయంగా మారాయని, టూ వీలర్స్ పోలేని పరిస్థితిలో ఎంతో మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారన్నారు. తుంగతుర్తి తిరుమలగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని ఇంతవరకు నిర్మించలేదన్నారు. ఇంత పెద్ద నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ ప్రభుత్వ కాలేజీలు లేవని, ఎక్కడ చూసినా డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా తయారైందని విమర్శించారు.
తిరుమలగిరి పట్టణంలోని మార్కెట్ వద్ద డ్రైనేజీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో ప్రశ్నించడం మానేసిన ప్రతిపక్షాలు, అధికార పార్టీ తో ఏకమై ఇసుక దందా, ల్యాండ్ మాఫియా చేస్తూ సామాన్య ప్రజలకు బతకలేని పరిస్థితిని కల్పిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సామాన్యుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ పోతే అక్కడ కూడా అధికార పార్టీ నాయకులు పెత్తనం చలామణి చేస్తూ వాళ్ల చెప్పు చేతుల్లో నడిచే విధంగా తయారు చేసుకున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులకు ప్రజా పంథా పార్టీ భయపడే చరిత్ర లేదని, ప్రజల పక్షాన ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిత్యం పోరాడుతూనే ఉంటుందన్నారు.
ఇకనైనా ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్పందించి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించాలని లేనట్లయితే ప్రజాందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్, పి డి ఎస్ యు రాష్ట్ర సహాయక కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, వ్యవసాయ కార్మిక రాష్ట్ర నాయకులు అంజన్న, ఎఫ్ టు యు జిల్లా కన్వీనర్ రామోజీ, పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు చంద్రక్క, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు సింహాద్రి లీలక్క దుర్గన్న, వెంకన్న, ఉప్పన్న, పి వై జిల్లా నాయకులు పరశురాం, పార్టీ డివిజన్ నాయకులు లక్ష్మన్న, శోభన, సుగుణక్క తదితరులు పాల్గొన్నారు.