ఇప్పటికి ఎన్నోసార్లు కూటమిని మార్చిన నితీశ్‌కుమార్.. ఈసారి మాత్రం ఇంకెక్కడికీ వెళ్లేది లేదని నమ్మబలికారు. అదే సమయంలో తాను గతంలో ఉన్న కూటమిలోకే వెళ్లానంటూ సమర్థించుకున్నారు. 2024 చివరి నాటికి జేడీయూ మటుమాయం అవుతుందని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ చేసిన వ్యాఖ్యలపై నితీశ్ స్పందిస్తూ.. ‘మేం బీహార్ అభివృద్ధి, ప్రగతికోసం పనిచేశాం. ఇప్పుడూ అదే పని చేస్తాం. తేజస్వి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు నేను గతంలో ఎందులో ఉన్నానో అందులోకే వచ్చాను. ఇక ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదు’ అని ప్రమాణ స్వీకారం అనంతరం నితీశ్ మీడియాతో అన్నారు.
ఇప్పటికి ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారని, త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. ఇండియా కూటమి పనితీరు సరగ్గా లేదని, అందుకే పార్టీ నాయకులు తనను రాజీనామా చేయాలని కోరారని నితీశ్ తెలిపారు. ఇండియా కూటమిలోకి ప్రతిపక్ష పార్టీలను తాను తీసుకొచ్చినా.. వారు మాత్రం ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదని నితీశ్ ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బీహార్‌లోని 40 సీట్లలోనూ విజయం సాధిస్తుందని ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమ్రాట్ చౌదరి చెప్పారు.