Balagam
విధాత: తెలంగాణ పల్లె బతుకు చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ‘బలగం’ సినిమాకు జనంతో పాటు రాజకీయ నేతలు కూడా జై కొడుతున్నారు. వంద గడపల మంద నా పల్లె.. గోడ కట్టని గూడు నా పల్లె..
సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే.. మావ, అత్త, బావ, బాపు వరసలే.. ఊరంతా సుట్టాల ముల్లె నా పల్లె…అంటూ తెలంగాణ పల్లెల జీవనాన్ని.. యాస, బాష, సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపించిన బలగం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రస్తుతం ప్రతీ గుండె ఆ దృశ్యకావ్యాన్ని ఆదరిస్తోంది. ప్రతీ పల్లె పరవశిస్తోంది.. మట్టి తల్లి పులకరించేలా.. బంధాలను బలపరిచేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమాను జనం పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. గ్రామాల్లో ఊరు ఊరంతా ఒకచోట చేరి బలగం సినిమా సామూహిక ప్రదర్శనలు తిలకిస్తున్నారు.
రాజకీయ పార్టీల్లో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామాల సర్పంచులు తమ తమ చిత్రాలతో కార్యకర్తలే మా బలం ప్రజలే మా బలగం అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకొందరైతే గ్రామాల్లో బలగం సినిమా ఉచిత సామూహిక ప్రదర్శన ఏర్పాటు చేయడంలో పోటీ పడుతున్నారు.
ప్రతీ పల్లె బలగంగా ఏర్పడి ‘బలగం’ సినిమాను చూస్తున్నారంటే మాటలా. పండుగ రోజుల్లో ఊరంతా ఒక్కటిగా మారి సందడి చేస్తుంటారు. ఇప్పుడు బలగం సినిమా ప్రతీ పల్లెలో.. ప్రతీరోజు పండుగ తీసుకొచ్చింది. ఊరు మొత్తాన్ని ఏకం చేసి అందర్నీ ఒకేచోట కూర్చోబెట్టింది.
తెలంగాణ ప్రజల ఆదరణ పొందిన బలగం సినిమా దర్శకులు వేణు, నిర్మాత దిల్ రాజు, నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ ను సన్మానించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయించారు. క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించేలా పాట పాడిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు ఆర్థిక సాయం అందించనున్నారు.
కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8న నల్గొండలోని గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్ లో ఉదయం 10:00గంటలకు బలగం చిత్ర బృందానికి సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.