‘GHMC’ కార్యాలయాన్ని తన పేరు మీద మ్యూటేషన్ చేయించుకున్న కార్పొరేటర్‌..

బల్దియా బాస్ జర దేఖో.. విధాత, హైద్రాబాద్: జీహెచ్ఎంసీ తీసుకొస్తున్న సంస్కరణలు అక్రమార్కులకు ఆసరాగా మారాయి. ఏకంగా ప్రభుత్వ ఆస్తులను కొట్టేస్తున్నారు. బల్దియా అధికారుల అసమర్థతను బయట పెట్టాడో ప్రజా ప్రతినిధి. జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తన పేరు మీద మ్యూటేషన్ చేసుకొని అధికారులకు ఝలక్ ఇచ్చాడు ఓ కార్పొరేటర్. బల్దియా పరిధిలో ఆస్తులు, చెరువులు, నాలాలు కబ్జాలు అవుతుంటే కాపాడాల్సింది పోయి కబ్జాదారులకు మరింత ఊతమిచ్చేలా అధికారుల చర్యలు ఉన్నాయి. ట్యాక్స్ రాబట్టేందుకు పాత పద్ధతికి […]

  • Publish Date - December 25, 2022 / 02:02 AM IST

బల్దియా బాస్ జర దేఖో..

విధాత, హైద్రాబాద్: జీహెచ్ఎంసీ తీసుకొస్తున్న సంస్కరణలు అక్రమార్కులకు ఆసరాగా మారాయి. ఏకంగా ప్రభుత్వ ఆస్తులను కొట్టేస్తున్నారు. బల్దియా అధికారుల అసమర్థతను బయట పెట్టాడో ప్రజా ప్రతినిధి. జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తన పేరు మీద మ్యూటేషన్ చేసుకొని అధికారులకు ఝలక్ ఇచ్చాడు ఓ కార్పొరేటర్.

బల్దియా పరిధిలో ఆస్తులు, చెరువులు, నాలాలు కబ్జాలు అవుతుంటే కాపాడాల్సింది పోయి కబ్జాదారులకు మరింత ఊతమిచ్చేలా అధికారుల చర్యలు ఉన్నాయి. ట్యాక్స్ రాబట్టేందుకు పాత పద్ధతికి పాతరేసి రిఫార్మ్ పేరిట సెల్ఫ్ అసెస్ మెంట్ స్కీం తెచ్చింది బల్దియా. అయితే ఇదే ఇప్పుడు అక్రమార్కులకు ఒక ఆయుధంగా మారింది. దీన్నిబల్దియా కౌన్సిల్ వేదికగా నిరూపించారు మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్.

కబ్జాదారులకు సెల్ప్ అసెస్ మెంట్ స్కీం అనుకూలంగా ఉందంటూ గతంలో జరిగిన సమావేశాల్లోనూ కార్పొరేటర్లు సమస్యను లేవనెత్తినా.. పట్టించుకోలేదు అధికారులు. స్వయంగా అసిస్టెంట్ కమిషనర్ అలాంటివాటికి అవకాశమే లేదని, సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

అయితే టీఆర్ఎస్ నాయకులు భూములు కబ్జా చేసేందుకే ఈ స్కీం తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు. బల్దియా కార్యాలయాలను కూడా ఎవరైనా మ్యూటేషన్ చేసుకున్నా పరిశీలించేది కూడా లేదు. సర్కిల్ కార్యాలయాలను స్వయంగా ఓ కార్పొరేటర్ మ్యూటేషన్ చేసినా పట్టించుకునే వారు లేకుండా పోయింది.

బల్దియా పరిధిలో ఖాళీ స్థలాలు, నాలాలు ఆక్రమించుకుంటున్న ఉదంతాలు అనేకం జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి బదులు మరింత ప్రయోజనం కలిగించేలా మారింది సెల్ఫ్ అసెస్ మెంట్ పథకం. ఎవరి ఇంటిని వారే లెక్క వేసి పన్ను కట్టడమే సెల్ప్ అసెస్ మెంట్ స్కీం. అయితే అది ఎంత అధ్వాన్నంగా ఉందో నిరూపించేందుకు డెకాయ్ ఆపరేషన్ చేశారు మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్.

ఏకంగా జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయాన్ని అసెస్ చేసి ఆ మేరకు పన్ను కూడా చెల్లించారు శ్రవణ్. సంబంధిత పత్రాలతో జీహెచ్ఎంసీ మేయర్, అధికారులను ప్రశ్నించేందుకు కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారు. అయితే సభను మేయర్ వాయిదా వేయడంతో చర్చ లేకుండానే ఈఅంశం పక్కకు పోయింది. సర్కిల్ కార్యాలయాలను ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చేందుకే సెల్ఫ్ అసెస్ మెంట్ తీసుకొచ్చారా అంటూ శ్రవణ్ ప్రశ్నించారు.

లోపభూయిష్టంగా ఉన్న సెల్ప్ అసెస్ మెంట్ ను సమీక్షించాల్సిన అవసరాన్ని ఈ ఘటన నిరూపిస్తోంది. స్వయంగా కార్పొరేటర్ గా తాను ఈ ఆపరేషన్ చేసినా.. బల్దియా అధికారులు గుర్తించ లేకపోయారని, అదే స్కీమ్ కింద ఇప్పటివరకు ఎంత మందికి ప్రభుత్వ స్థలాలు, ఆస్తులను మ్యూటేషన్ చేశారో చెప్పాలంటూ శ్రవణ్ డిమాండ్ చేశారు.