Site icon vidhaatha

Sunny Deol | సన్నీ డియోల్ ఇల్లు వేలం వెన‌క్కి

Sunny Deol | విధాత‌: కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం కొల్ల‌గొట్టి విదేశాల‌కు పారిపోతున్న బ‌డా బాబుల‌కు మోదీ సర్కారు కొమ్ము కాస్తున్న‌ద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్ప‌టికే కోట్ల రూపాయ‌ల రుణం బ్యాంకుల‌కు ఎగొట్టి విదేశాల‌కు పారిపోయిన వారిని స్వ‌దేశానికి ర‌ప్పించి వారి ఆస్తుల‌ను వేలం వేసి మొత్తం రాబ‌ట్టాల్సిన స‌ర్కారు చోద్యం చూస్తున్న‌ద‌ని విమ‌ర్శిస్తున్నాయి.

తాజాగా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సన్నీ డియోల్ కూడా మోదీ స‌ర్కారు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ట్టు మండిప‌డుతున్నాయి. సన్నీ డియోల్ బ్యాంకుకు చెల్లించాల్సిన రూ. 56 కోట్లను చెల్లించనందున ముంబై జుహులో ఉన్న ఆయ‌న‌ నివాసాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇ-వేలానికి పెట్టినట్టు ఆదివారం వార్త‌లు రాగా, 24 గంటల్లోపే, ‘సాంకేతిక కారణాల’ కారణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వేలం నోటీసును ఉపసంహరించుకున్నట్టు తెలియ‌డం దేశ‌వ్యాప్తంగా మోదీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

‘సాంకేతిక కారణాల’ను ఎవరు ప్రేరేపించారో..!

వేలం నోటీసును ఉపసంహర‌ణపై ఎంపీ, కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జైరామ్ ర‌మేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సన్నీ డియోల్ బ్యాంకుకు చెల్లించాల్సిన రూ. 56 కోట్లను చెల్లించనందున ఆయన జుహు నివాసాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇ-వేలానికి పెట్టినట్టు నిన్న మధ్యాహ్నం దేశానికి తెలిసింది.

ఈ ఉదయం, 24 గంటలలోపే, ‘సాంకేతిక కారణాల’ కారణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వేలం నోటీసును ఉపసంహరించుకున్నట్టు కూడా దేశానికి తెలిసింది. ఈ ‘సాంకేతిక కారణాల’ను ఎవరు ప్రేరేపించారని ఆశ్చర్యపోతున్నారా?’ అని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ప‌రోక్షంగా మోదీ స‌ర్కారు త‌న ఎంపీకి మ‌ద్ద‌తుగా నిలిచింద‌ని మండిప‌డ్డారు.

రుణం ఎంత అంటే

బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్ 2016లో ఒక సినిమా కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి అప్పు తీసుకున్నారు. సన్నీడియోల్‌ 56 కోట్ల బ‌కాయి చెల్లించకపోవడంతో ఆయన ఇంటిని సెప్టెంబర్ 25న ఈ-వేలం వేయనున్నట్టు ప్రకటించారు. అది గత ఏడాది డిసెంబర్‌ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది.

Exit mobile version