BOB | Bank Of Baroda | mDigiNext
ముంబయి: భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బ్యాంక్) తన కార్పొరేట్ కస్టమర్ల కోసం బరోడా క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (BCMS) కింద ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. “బరోడా ఎండిజినెక్స్ట్” (mDigiNext)పేరుతో ఈ యాప్‌ను ఆవిష్కరించడం ద్వారా, క్యాష్ మేనేజ్‌మెంట్ సేవల కోసం ప్రత్యేకంగా యాప్‌ను ప్రవేశపెట్టిన కొద్ది బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటిగా నిలిచింది. ఈ యాప్ కార్పొరేట్ సంస్థలు తమ వర్కింగ్ క్యాపిటల్ మరియు నగదు ప్రవాహాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే విధానాన్ని మార్చివేయనుంది. ఇది వ్యాపారాలకు వేగవంతమైన సేవలు మరియు సౌలభ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఈ అత్యాధునిక బరోడా ఎండిజినెక్స్ట్ మొబైల్ యాప్ కార్పొరేట్ సంస్థల క్యాష్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించబడింది. 24×7 అందుబాటులో ఉండే ఈ యాప్, కస్టమర్లకు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఉపయోగపడే వీలును కల్పిస్తుంది. దీనితో వ్యాపార సంస్థలు త్వరితగతిన తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. ఈ యాప్ ఆవిష్కరణ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ దేబదత్త చంద్ మాట్లాడుతూ.. “బరోడా ఎండిజినెక్స్ట్ మొబైల్ యాప్‌తో మేము కార్పొరేట్ క్లయింట్లకు క్యాష్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ సేవల్లో సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నాము.
ఈ యాప్ సులభంగా ఉపయోగించే ఇంటర్‌ఫేస్, అధునాతన సాధనాలు, సజావుగా అమలు చేసే సామర్థ్యాలను కలిగి ఉంది. ఇది మా కస్టమర్లకు విలువైన సమాచారాన్ని అందించి, పోటీతత్వ వ్యాపార వాతావరణంలో చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది” అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లలిత్ త్యాగి మాట్లాడుతూ, “బరోడా ఎండిజినెక్స్ట్ మొబైల్ యాప్ ప్రారంభం క్యాష్ మేనేజ్‌మెంట్ సేవల్లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది ఆవిష్కరణాత్మక, భవిష్యత్ సంసిద్ధమైన డిజిటల్ పరిష్కారాలను అందించే మా నిబద్ధతను పటిష్ఠం చేస్తుంది. ఇది కస్టమర్ల సౌలభ్యం, సామర్థ్యం, నగదు ప్రవాహ నిర్వహణపై మెరుగైన నియంత్రణను అందిస్తుంది” అని పేర్కొన్నారు.
యాప్ ఫీచర్లు..
బరోడా ఎండిజినెక్స్ట్ మొబైల్ యాప్ అనేక కీలక ఫీచర్లను అందిస్తుంది:
- ఒక్కొక్కటిగా లావాదేవీలను సృష్టించడం
- బల్క్ అప్లోడ్లను ఆమోదించడం లేదా తిరస్కరించడం
- లావాదేవీలు, వర్క్‌ఫ్లోలను ఎండ్ టు ఎండ్ వరకు ట్రాక్ చేయడం
- లావాదేవీ స్థితిపై రియల్-టైమ్‌లో విచారించడం
- బ్యాంక్ స్టేట్మెంట్స్, మినీ-స్టేట్మెంట్లను చూడడం
- అన్ని గ్రూప్ ఎంటిటీల ఏకీకృత డాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేయడం
- OTP వెరిఫికేషన్, 3-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్తో మెరుగైన భద్రత అందించడం
ప్రస్తుతం ఈ ఎండిజినెక్స్ట్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది, త్వరలో iOS వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది.