ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 108 మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో భారీగా 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2026 మార్చి నాటికి సాయుధ మావోయిజాన్ని అంతం చేయడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అసెంబ్లీలో ప్రకటించారు.

108 Maoist Surrender

విధాత : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. 108 మంది మావోయిస్టులు ఆ రాష్ట్ర పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.3.29 కోట్లు రివార్డు ఉందని, లొంగిపోయిన వారు 101 ఆయుధాలను అప్పగించారని అధికారులు తెలిపారు. బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయంలో మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగింది. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీ డంపును స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. 2024 నుంచి 2625 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసినట్లుగా పోలీసులు వెల్లడించారు.

సాయుధ మావోయిజాన్ని అంతం చేయడానికి 2026 మార్చి 31 తుది గడువుగా కేంద్రం నిర్ణయించిందని, ఆ తర్వాత బస్తర్ అడవులు నుంచి బలగాల ఉపసంహరణ మొదలవుతుందని ఆశిస్తున్నట్లు చత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి 31 నాటికి కేంద్ర బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొన్ని ప్రాంతాలలో ముందే బలగాల ఉపసంహరణ జరుగుతుందని, అదే ఏడాది చివరికల్లా బస్తర్ నుంచి అన్ని కేంద్ర బలగాలు వెళ్లిపోతాయని తెలిపారు.

ఒడిశాలో 10మంది లొంగుబాటు

మరోవైపు ఒడిశాలోని కంథమాల్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ ఎదుట 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ సభ్యురాలు నీతూ కూడా ఉన్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన వారిపై మొత్తం రూ.1.65 కోట్ల రివార్డు ఉందని ఎస్పీ వివరించారు.

ఇవి కూడా చదవండి :

విజయ డెయిరీ లొల్లి : మంత్రి లోకేష్..గుత్తా అమిత్ ట్వీట్ వార్
Harish Rana Passive Euthanasia : 13ఏళ్లుగా కోమాలో..కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి!

Latest News