Site icon vidhaatha

BRS ఎమ్మెల్యేల‌కు బీసీ బంధు గండం! లక్షల్లో దరఖాస్తులు.. వందల్లో లబ్ధిదారులు

BRS

హైదరాబాద్‌, విధాత: బీసీ బంధు పథకం లబ్ధిదారులందరికీ అందేనా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. బీసీ బంధు పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటి నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి, ఆర్థిక సహాయం అందించాలి. ఈ బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సంబంధిత ఎమ్మెల్యేలకు అప్పగించారు.

దీంతో ఎమ్మెల్యేల పరిస్థితి ‘ఇడువమంటే పాముకు కోపం, కరువమంటే కప్పకు కోపం’ అన్న చందంగా తయారైంది. దీంతో ఎవరిని ఎంపిక చేయాలో, ఎవరిని పక్కన పెట్టాలో అర్థం కాక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఫలితంగా ఆగస్ట్‌ 15 నాటికి పూర్తికావాల్సిన మొదటి దఫా పంపిణీ ఇప్పటికీ పూర్తికాలేదు. ఇక రెండవ విడత ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఎన్నికల నాటికి బీసీ బంధు పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న తరుణంలో బీఆరెస్ ప్రభుత్వం ముచ్చట‌గా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడం కోసం వివిధ‌ సంక్షేమ ప‌థ‌కాలు ప్రవేశ‌పెడుతూ ప్రజ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నది. ఈ క్రమంలోనే ఇండ్లు లేని పేద‌ల‌కు గృహ‌లక్ష్మి ప‌థ‌కం కింద మూడు ల‌క్షల రూపాయ‌లు సాయం చేసేందుకు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. ద‌ళిత బంధులాగే వివిధ వృత్తుల్లో ఉన్న బీసీల‌ను ఆర్థికంగా ఆదుకోవ‌డానికి ల‌క్ష రూపాయలను అంద‌జేస్తామ‌ని ప్రకటించింది. మైనారిటీలకు కూడా ఇలానే ఇవ్వనున్నట్టు ప్రక‌టించింది. ఇలా వరుసగా ఆర్థికంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరాలన్న తీరుగా పథకాలను బీఆరెస్‌ సర్కారు తీసుకువచ్చింది. ఇందులో భాగమే బీసీ బంధు.

నియోజకవర్గానికి 300 మందికి

బీసీ బంధు అమలు కోసం దరఖాస్తులు స్వీకరించిన సర్కారు మొద‌టి విడ‌త‌గా నియోజ‌క‌వ‌ర్గానికి 300 మంది ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయాలని నిర్ణయించింది. దీనికోసం దాదాపు రూ.350 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మొదటి విడత పంపిణీ జూలై 15 నుంచి ఆగస్ట్‌ 15 మధ్యలో పూర్తి చేయాలని సర్కారు ఆదేశించింది. సహజంగా లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లు చేపడతారు. కానీ సీఎం కేసీఆర్‌ దీనికి విరుద్ధంగా ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఎన్నికలలో ప్రయోజనం పొందడానికే లబ్ధిదారుల ఎంపికలో అధికారులను కాదని ఎమ్మెల్యేలకు అప్పగించారన్న విమర్శలు ఉన్నాయి.

లక్ష సాయం తమ చేతుల మీదుగా అందితే ఓట్లు పడతాయని ఆశించిన ఎమ్మెల్యేలకు చివరకు ఇది తలనొప్పిగా పరిణమించింది. వేలల్లో దరఖాస్తులు వస్తే 300 మందిని మాత్రమే ఎంపిక చేయాలంటే ఎలాగని ఎమ్మెల్యేలు మథనపడుతున్నారు. ఏ ఒక్కరిని కాదన్నా ఎన్నికల ముందు శత్రువులను కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్న ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. దీంతో కొంత మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయలేదని తెలిసింది.

21వేల మంది ఎంపిక

మొదటి విడుతతో నియోజ‌క‌వ‌ర్గానికి 300 మంది చొప్పున 119 నియోజ‌క‌వర్గాల‌కు 35,700 మందిని ఎంపిక చేయాలి. కానీ ఇప్పటి వరకు 21 వేల మందిని మాత్రమే ఎంపిక చేసి పంపిణీ చేశారు. ఇంకా 15 వేల మందిని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ రాజకీయ కారణాలు, ఒకరిని ఎంపిక చేస్తే పది మంది వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉందన్న భయంతో ఎమ్మెల్యేలు ఎంపిక చేయకుండా అలాగే పక్కన పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మొదటి విడత ఎంపికనే పూర్తి కాలేదు, రెండ విడత పంపిణీ ఉంటుందా? అన్న సందేహాలను దరఖాస్తు దారులు వ్యక్తం చేస్తున్నారు.

గెలుపోటములు నిర్ణయించేది బీసీలే

రాష్ట్రంలో బీసీల జనాభా 51శాతం ఉన్నది. ఎన్నికల్లో గెలుపు ఓటములు నిర్ణయించే శక్తి బీసీలకు ఉంది. దీంతో బీసీలకు నేరుగా నగదు లబ్ధి చేకూర్చడం కోసం కేసీఆర్‌ బీసీ బంధును తీసుకువచ్చారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రభుత్వం 2014లో నిర్వహించిన‌ స‌కుటుంబ స‌ర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 1,85,61,856 మంది ఉన్నారు. అది తెలంగాణ జ‌నాభాలో 51 శాతంగా న‌మోదు అయింది.

మైనార్టీలు 14% ఉన్నారు. బీసీ బంధు ద్వారా 51శాతం, మైనార్టీ బంధు ద్వారా 14శాతం కలిసి 65 శాతం జనాభాకు లబ్ధి చేకూరిస్తే హ్యాట్రిక్‌ సాధించ వచ్చునని నిర్ణయానికి వచ్చిన కేసీఆర్‌ ఈ పథకాలను ప్రకటించారన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నది.

అయితే ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య మొదటి విడతగా నియోజక వర్గానికి కేవలం 300 మందికే పరిమితం చేయడంతో ఇబ్బంది కరంగా తయారైందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధినేతకు చెప్పుకోలేక, క్షేత్ర స్థాయిలో అమలు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేలు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

గృహలక్ష్మిదీ అదే పరిస్థితి

గృహ‌ల‌క్ష్మికి ఇప్పటికే ల‌క్షల్లో ద‌ర‌ఖాస్తులు అందాయి. వీటిని కూడా ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేల‌కే అప్పగించారు. దీంతో ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్నవారికే గృహ‌ల‌క్ష్మి అయినా బీసీ బంధు అయినా, మైనార్టీ బంధు అయినా వ‌రిస్తోంద‌ని ప్రతి గ్రామంలో వాడి వేడి చ‌ర్చలు న‌డుస్తున్నాయి. ఓ విధంగా చూసుకుంటే ఈ ప‌థ‌కాలు అంద‌నివారు బీఆరెస్‌కు వ్యతిరేక‌మ‌య్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

Exit mobile version