తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్‌లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి

  • Publish Date - November 29, 2023 / 11:29 AM IST
  • అధికారం ఏ పార్టీది..ఎవరికెన్ని సీట్లు
  • ప్రముఖుల్లో గెలిచేదెవరు అంశాలతో పందాలు


విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఒకవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రలోభాల పర్వం సాగిస్తూ డబ్బులు, మద్యం పంపిణీ చేయగా, ఇంకోవైపు గెలుపు ఓటములపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. తెలంగాణలో మళ్లీ బీఆరెస్ హ్యాట్రిక్ కొడుతుందా, ఈ దఫా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా.. బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని..హంగ్ వస్తుందా.. ఎంఐఎం, బీజేపీ సీట్లు కీలకమవుతాయా అన్న అంశాలపై బెట్టింగ్‌లు కడుతున్నారు.


ప్రధానంగా బెట్టింగ్ రాయుళ్లు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంతో పాటు ప్రముఖుల సీట్లలో ఎవరు గెలుస్తారన్నదానిపై కూడా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై ఈటెల గెలుస్తారా, కొడంగల్‌, కామారెడ్డిలలో రేవంత్ ఎక్కడ గెలుస్తారు..కేటీఆర్, కేసీఆర్‌ల మెజార్టీ ఎంత అన్న అంశాలపై బెట్టింగ్ కాస్తున్నారు.


అలాగే కొల్లాపూర్‌లో బర్రెలక్క ఎన్ని ఓట్లు సాధిస్తుంది..కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుస్తారా.. మైనంపల్లి, మల్లారెడ్డిలు గెలుస్తారా..పాలకుర్తిలో యశస్వీరెడ్డి గెలుస్తుందా.. కరీంనగర్‌లో బండి సంజయ్ గెలుస్తాడా వంటి అంశాలతో ప్రముఖల గెలుపు ఓటములపై కూడా పందాలు కాస్తున్నారు. బెట్టింగ్‌లు తెలంగాణతో పాటు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగ్‌లు సాగుతున్నాయని తెలుస్తుంది.