విధాత, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా 27మంది పార్టీ, పీఎల్జీఏ సభ్యుల ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు పార్టీ జూన్ 10న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదల చేశారు. జూన్ 11నుండి ఆగస్టు 3వరకు కేశవరావు సహా 27మంది అమరుల స్మారక సభలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లుగా అభయ్ తెలిపారు. మే 21న భారత విప్లవోద్యమ చరిత్రలో చీకటి రోజు అని బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ కేంద్ర, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల ఆదేశాలతో భద్రతా బలగాలు నారాయణ్ పూర్ జిల్లా మాడ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ లో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ సహా 27మంది హత్య చేశాయని అభయ్ ఆరోపించారు. ఈ హత్యకాండను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ జూన్ 10న తలపెట్టిన భారత్ బంద్ ను, అమరుల స్మారక సభలను విజయవంతం చేయాలని దేశ ప్రజలను అభయ్ ప్రకటనలో కోరారు.
తాము శాంతి చర్చలకు సిద్ధమని కాల్పుల విరమణ ప్రకటించినా కేంద్రం మాత్రం 2026మార్చి 31వరకు ఆపరేషన్ కగార్ నరమేధాన్ని కొనసాగిస్తామంటుందని అభయ్ తప్పుబట్టారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్టు వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విశాలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ప్రజానికాన్ని కోరుతున్నామని అభయ్ తెలిపారు. నంబాల కేశవరావు తన 51సంవత్సరాల విప్లవ జీవితంలో చేసిన సేవలను, నిర్వర్తించిన బాధ్యతలను అభయ్ తన ప్రకటనలో గుర్తు చేసి కొనియాడారు.