Maoist Party Latest Letter | మావోయిస్టు పార్టీ లేటెస్ట్‌ సంచలన లేఖ.. దీర్ఘకాలిక ప్రజాయుద్ధంపై కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వానికి లొంగిపోయిన సోనూ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్, సతీశ్‌ అలియాస్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావులు రాజకీయంగా దిగజారిన ద్రోహులని మావోయిస్టు పార్టీ తన తాజా ప్రకటనలో పేర్కొంది. తమ ప్రజాయుద్ధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Maoist Party Latest Letter | మావోయిస్టు పార్టీ పంథాను తప్పుపట్టే హక్కు పార్టీ కేంద్రకమిటీ నాయకులుగా ఉండి.. ఇటీవల లొంగిపోయిన సోనూ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్, సతీశ్‌ అలియాస్ తక్కెళ్ళపల్లి వాసుదేవరావులకు లేదని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సోను, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న సతీశ్‌ రాజకీయంగా దిగజారిన ద్రోహులంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి చర్చల సందర్భంగా సాయుధ పోరాట విరమణ చేయాలని, ముందు ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు సిద్ధం కావాలని అన్నారని అమరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎప్పుడూ చెప్పలేదని స్పష్టంచేసింది. ఇలాంటి అంశాలేవైనా పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారంటూ పేర్కొన్నారు. నంబాలను చెప్పిన విషయాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నిర్దేశించుకున్న దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథానే కొనసాగిస్తుందని తేల్చిచెప్పారు. పార్టీ ఇప్పటి వరకు ఉద్యమంలో జరిగిన తప్పులను ఎప్పుడూ కప్పిపుచ్చుకోలేదని ప్రకటనలో పేర్కొన్నారు. భారత సమాజంలో వచ్చిన మార్పుల పై చర్చించి ఇప్పటికీ పార్టీ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను కొనసాగిస్తుందని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సోనూ, సతీశ్‌ రాజకీయంగా ఎదగకపోవడం వల్లే ప్రాణభయంతో లొంగుబాట పట్టారని విమర్శించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ నవంబర్ 5 తేదీన సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

Maoists | మావోయిస్టులకు నిధులు ఎలా వస్తాయి.. ఆయుధాలు ఎలా కొనుగోలు చేస్తారో తెలుసా?

ప్రభుత్వాలతో సోనూ, సతీశ్‌ ఒప్పందం

‘సోనూ, సతీష్ అవకాశవాదంతో, విచ్ఛిన్నకర వైఖరితో మరి కొందరు కేడర్ లను మోసగించి తీసుకుని ప్రభుత్వాలకు లొంగిపోయారు. వీరిద్దరూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుని, పథకం ప్రకారం లొంగిపోయారు. సోను లొంగిపోయేందుకు మూడు నెలల క్రితమే తమను సంప్రదించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పత్రికా ముఖంగా ప్రకటించారు. పాత్రికేయుల ద్వారా ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రితో సతీశ్‌ సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపుల మేరకే కొద్ది కాలం పాటు ఈ ప్రాంతాలలో ఆపరేషన్ లను నిలిపి వేస్తున్నట్టుగా గడ్చిరోలి జిల్లా, పోలీసు అధికారి బహిరంగంగా ప్రకటించారు’ అని తెలిపారు.

Maoists surrender intense debate | లొంగుబాటా… వెసులుబాటా! మల్లోజుల, ఆశన్న నిర్ణయంపై మేధావి వర్గం ఏమంటున్నది?

దిగజారి పంథాను తప్పుపడుతున్నారు

లొంగిపోయిన సోను, సతీశ్‌ తమ రాజకీయ దిగజారుడును కప్పి పుచ్చుకునేందుకు పార్టీ పంథాను తప్పు పడుతున్నారని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయుధ పోరాట విరమణను నంబాల కేశవరావే ప్రతిపాదించినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది. వాస్తవానికి శాంతి చర్చలకు సంబంధించి సతీశ్‌కు ఉన్న అవగాహనలోని లోపాలను వివరిస్తూ నంబాల కేశవరావు లేఖలు రాశారని తెలిపింది. ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు వెళదామన్నది కామ్రేడ్ నంబాళ్ల కేశవరావ్ అభిప్రాయం కాదని ప్రకటన స్పష్టంచేసింది.

Maoists | మావోయిస్టుల శ‌కం ముగిసిన‌ట్లేనా..? 68 ఏళ్ల త‌రువాత సీన్ రిపీట్‌..!

దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా

దేశ కాల పరిస్థితులలో మార్పుల గురించి చర్చించిన కేంద్ర కమిటీ 2021లో ‘భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలలో మార్పులు-మన రాజకీయ కార్యక్రమం’ దస్తావేజును రూపొందించిందని, దేశంలో భూస్వామ్యం ఒక మేరకు బలహీనపడినప్పటికీ, ఇప్పటికీ భూస్వామ్యమే ప్రధాన వైరుధ్యంగా ఉన్నదని స్పష్టం చేసిందని పేర్కొన్నది. అలాగే పెట్టుబడిదారీ సంబంధాలలో గతంతో పోల్చుకున్నప్పుడు కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, మెజారిటీ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, భూమి సమస్య మౌలికమైనదని, కాబట్టి దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథాను కొనసాగించాలని వివరించిందని ప్రకటన తెలిపింది. ఈ డాక్యుమెంట్‌తో సోను, సతీశ్‌ గతంలో విభేదించలేదని, ఇప్పుడు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నది. సోను, సతీశ్‌ అవగాహన, ద్రోహం ప్రాణ భయంతో వచ్చినవేనని తెలిపింది.

Maoists Clarification Ceasefire  | అది పార్టీ నిర్ణయం కాదు.. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే: మావోయిస్టు పార్టీ

లోపాలను పార్టీ కప్పిపుచ్చుకోలేదు

పార్టీ ఎన్నడూ తన లోపాలను, పొరపాట్లను కప్పి పుచ్చుకోదని, ఇప్పటి వరకూ కప్పి పుచ్చుకోలేదని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. పార్టీ, ప్రజా సైన్యం, ఐక్య సంఘటన అనే మూడు అద్భుత ఆయుధాలతో భారత కార్మికవర్గ అగ్రగామిగా విప్లవోద్యమానికి మార్గదర్శకత్వం వహించడంలో జరిగిన పొరపాట్లను కాంగ్రెస్ అనంతర 14 సంవత్సరాల కార్యాచరణను సంశ్లేషించి, విశ్లేషించిన కేంద్ర కమిటీ 2020లో రూపొందించిన కేంద్ర రాజకీయ నిర్మాణ సమీక్షలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పుడు ‘కేంద్ర కమిటీ అన్నీ తప్పులే చేసిందం’టూ సోను ప్రజలకు క్షమాపణలు చెప్పడం, ‘ఇక పార్టీ ఏం చేయలేదు. అందరం చచ్చిపోతాం, లేదా సరెండర్ చేయించుకుంటాడం’టూ సతీష్ ఏప్రిల్ నాటి నుంచి మాట్లాడడం ఒక కొసకు వెళ్లి ఆలోచించడమేనని పేర్కొన్నది. ‘నిజమైన కమ్యూనిస్టులు గతితార్కిక భౌతికవాద దృష్టితో చూస్తారు. అప్పుడే ప్రతి అంశంలోను ఉన్న పాజిటివ్, నెగిటివ్ అంశాలు అర్థం చేసుకోగలుగుతారు. అనుకూలతలు ఉన్న కాలంలో రాబోయే ప్రతికూలతలను అంచనా కడతారు, అలాగే ప్రతికూలతలలో అనుకూలతలను చూడగలుగుతారు. ఇలా చేయకపోతే పెడధోరణి పట్టి, ఒక కొసకు వెళ్లిపోతారు. సోను, సతీష్ లు చేసినదిదే’అని ప్రకటన పేర్కొన్నది.

సంఘటితం చేయడంలో వెనుకంజ

దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రాజ్యం పీడిత వర్గాలు, సమూహాల పట్ల అంతులేని అన్యాయాలు, అత్యాచారాలు చేస్తున్నది. వీటి పట్ల ప్రజలలో తీవ్రమైన నిరసన, ప్రతిఘటన సాగుతున్నాయి. వీటిని సంఘటితం చేయడంలో పార్టీ వెనుకపడుతున్నదని కేంద్ర కమిటీ గుర్తించి, అందుకు తగిన నిర్ణయాలు చేసిందని, ఈ నిర్ణయాలను అమలు చేయడంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి, లోపాలు జరిగాయని మావోయిస్టు పార్టీ తన ప్రకటనలో తెలిపింది. ‘ప్రకృతిలో తుఫానులు, కరువులు, వ్యాధులతో మరణాలు ఉన్నట్టుగానే విప్లవంలో నిర్బంధాలు, పారుబోతుతనాలు, నష్టాలు ఉంటాయి. ఈ చారిత్రక భౌతికవాద, గతితార్కిక నియమాన్ని అర్థం చేసుకున్న వారెవ్వరూ విప్లవం ఇక చేయలేం అని నిరాశకు గురి కారు. రాజకీయ వెనుకబాటుతనం, సైద్దాంతిక గందరగోళానికి గురి అయిన వారు దృఢ దీక్షను కోల్పోతారు. కుటిల బుద్ధితో విప్లవ సిద్ధాంతంపై, రాజకీయ పంథాపై, పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడతారు. ప్రజలను, కేడర్ లను గందరగోళానికి గురి చేస్తారు. వర్గ రాజకీయాలను గుర్తెరిగిన విప్లవ కేడర్ లు, ప్రజలు ఎవ్వరూ ఈ అవకాశవాదుల మూర్ఖపు మాటలు నమ్మరు. దేశంలో పీడిత ప్రజలు, సమూహాలు, ప్రజాస్వామికవాదులు, ప్రగతి కాముకులు, పాత్రికేయులు, ప్రజలూ అందరూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ తమ వంతు కర్తవ్యంగా విప్లవంలో భాగస్వాములుగా కొనసాగుతారని ఆశిస్తున్నాం’ అని తెలిపింది.

Read Also |

IRCTC Best Package: రూ. 13500కే స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం యాత్ర
Personal Loan Vs Mortgage Loan | పర్సనల్ లోన్, తాకట్టు రుణం: మీ అవసరాలకు సరైన రుణాన్ని ఎలా ఎంచుకోవాలి?
Indian IT layoffs | భారత కంపెనీ చట్టాల్లో లొసుగులు.. ఇష్టారాజ్యంగా ఐటీ ఉద్యోగుల తొలగింపులు!