Maoist Party | కాల్పుల విరమణ నిర్ణయాన్ని కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరో ఆరు నెలల పాటు పొడిగించింది. గత మే నెలలో ఆరు నెలల కాల్పుల విరమణను ప్రకటించిన మావోయిస్టులు తాజాగా మరికొంత కాలం కాల్పులు ఆపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగించే ఉద్దేశంతో కాల్పుల విరమణను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, పార్టీలు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆపరేషన్ కగార్ ప్రారంభమై.. తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా అనేక మంది కీలక నేతలు వివిధ ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో మావోయిస్టు శ్రేణులు ఆయుధాలు వదిలిపెట్టి.. జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఒకవైపు పార్టీలో అంతర్గత వైరుధ్యాలు.. మరోవైపు బాహ్య పరిస్థితుల్లో తీవ్ర ప్రతికూలత మధ్య మావోయిస్టు పార్టీ మునుపెన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు మావోయిస్టులు స్వచ్ఛందంగా కాల్పుల విరమణ ప్రకటిస్తున్నప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం వచ్చే ఏడాది మార్చి నాటికి ఒక్కరంటే ఒక్కరు మావోయిస్టు లేకుండా పూర్తిగా తుడిచిపెడతామని తేల్చి చెబుతున్నారు.