విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వాహనాల తనిఖీ సందర్భంగా ద్విచక్ర వాహన దారుడిపై చేయి చేసుకున్న ఎస్ ఐని గతంలో ఆ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి నిలదీసిన సంఘటన శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. ఎస్ఐని ప్రత్యక్షంగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం వాహన తనిఖీలో భాగంగా భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో భూపాల్ పల్లి ఎస్ఐ రామకృష్ణ వాహనాలను తనిఖీ చేస్తూ ఒక వాహనదారుడుపై అత్యుత్సాహంతో చేయి చేసుకున్నాడు. ఇదే సమయంలో గతంలో ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అటుగా వెళుతున్నారు. ఈ ఘటనను స్వయంగా చూసి అక్కడ ఆగారు.
అప్పుడు బాధితుడు మాజీ కలెక్టర్‌కు తన గోడు వినిపించాడు. దీంతో మాజీ కలెక్టర్ సదర్ ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాల తనిఖీ చేయడం డ్యూటీ కావచ్చు, సరైన పత్రాలు లేకుంటే జరిమానా వేయండి కానీ వాహనదారుడిపై చేయి ఎలా చేసుకుంటావంటూ నిలదీశారు.
మాజీ కలెక్టర్ ప్రశ్నలతో ఏం జవాబు చెప్పాలనో పాలు పోక ఎస్ఐ రామకృష్ణ తన వాహనం ఎక్కేందుకు వెళుతుండగా మాజీ కలెక్టర్ చేయి అడ్డుపెట్టినప్పటికీ తప్పుకొని తన పోలీసు వాహనమెక్కి వెళ్లి పోయారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.