Site icon vidhaatha

Bhuvanagiri | దశాబ్ది ఉత్సవాల వేళ..! మళ్లీ ఆట పాట.. అలయ్ బలయ్‌తో జనంలోకి జిట్టా..!!

Bhuvanagiri

విధాత: మలిదశ తెలంగాణ సాధన ఉద్యమంలో భువనగిరి కేంద్రంగా జిట్టా బాలకృష్ణారెడ్డి నిర్వహించిన ధూమ్ ధామ్‌లు, తెలంగాణ సంబురాలు, బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్ర సాధన ఉద్యమానికి బాటలు వేశాయనడంలో అతిశయోక్తి లేదు.

జిట్టా అందించిన ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ అంతట తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ధూంధామ్‌లు, తెలంగాణ సాంస్కృతిక సంబురాలు, బతుకమ్మ ఉత్సవ నిర్వహణతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అయితే సీఎం కేసీఆర్ తో ఎదురైన విభేదాలతో జిట్టా బాలకృష్ణారెడ్డికి మాత్రం రాజకీయంగా సరైన అవకాశాలు దక్కక బిఆర్ఎస్ కు దూరమై రాష్ట్ర రాజీయాల్లో మబ్బుచాటు సూరీడులా మిగిలిపోయారు.

బిఆర్ఎస్ పార్టీలోకి తనకంటే వెనక వచ్చిన వారు, ఉద్యమంతో సంబంధం లేని వారు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులైనప్పటికీ జిట్టా రాజకీయ జీవితానికి పట్టిన గ్రహణం మాత్రం తొలగలేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధపడుతున్న జిట్టా ఆనాటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని యాదిలోకి తేవడం ద్వారా జనం దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ మళ్లీ ధూమ్ ధామ్ ఆటాపాట, అలయ్ బలయ్ నిర్వహణకు పూనుకోవడం ఆసక్తి రేపుతుంది.

భువనగిరిలో 2009, 2014, 2018ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జిట్టా గట్టి పోటినిచ్చి ఓటమి చెందారు. గత రెండు ఎన్నికల్లోను తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని పైళ్ల శేఖర్ రెడ్డి ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి హ్యాట్రిక్ విజయానికి ఉరకలేస్తున్నారు.

కానీ భువనగిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపైన, మూసీ నది ప్రక్షాళన, నిమ్స్ వైద్య కళాశాల, బునాది గాని, పిల్లాయి పల్లి, బొల్లేపల్లి కాలువ సాధనాలకు పాతికేళ్ల పాటు పోరాడుతూ, ఊరురా వాటర్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు కళాశాలలు, పాఠశాల భవనాల నిర్మాణాలు సహా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన జిట్టకు మాత్రం ఎన్నికలు కలిసి రావడం లేదు. కర్ణుడి చావుకి పలు కారణాలు అన్నట్లుగా జిట్టా ఎన్నికల్లో గెలుపు దాకా వచ్చి, రాజకీయ పరిస్థితులు కలిసి రాక, గెలుపు సాధన సమీకరణలు కుదరక ఓటమి పాలవుతున్నారు.

2003లో కేసీఆర్ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్‌లో చేరిన జిట్టా 2004 ఎన్నికల్లో భువనగిరి టికెట్ ను ఆలే నరేంద్ర కోసం త్యాగం చేశారు. 2009లో మహాకూటమితో టీడీపీకి భువనగిరి సీటు కేటాయించడంతో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిట్టా 34,720 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2009 ఎన్నికల్లో సీఎం వైఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోగా, డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన నుండి కాంగ్రెస్ యూటర్న్‌తో ఆ పార్టీకి రాజీనామా చేసి, యువ తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేశారు.

2014, 2018 ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ నుంచి ఇండిపెండెంట్ గుర్తుపై పోటీ చేసి ఓడిన జిట్టా 2022 జూన్ 2న బిజేపిలో చేరారు. రానున్న ఎన్నికల్లో మరోసారి భువనగిరి స్థానం నుండి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు జిట్టా సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో తనకు గతంలో ప్రజల్లో గుర్తింపు తెచ్చి పెట్టిన తెలంగాణ ధూంధాం ఆటపాటలు, అలయ్ బలయ్ ల నిర్వహణతో మళ్లీ జనాధ‌రణకు జిట్టా ప్రయత్నిస్తున్నారు. జిట్టా ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయన్నది మున్ముందు తేలనుంది.

Exit mobile version