విధాత: యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశ రాజధాని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి ముస్తాబవుతున్నది. 27 ఎకరాల్లో ఏడు గోపురాలతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14 ప్రారంభించనున్నారు. ఈ విషయాన్నిసోమవారం యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా Xలో వెల్లడించింది. అబుదాబిలో బీఏపీఎస్ (బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ) హిందూ దేవాలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌చేసింది.
అబిదాబి ఆలయం అరబ్‌దేశాల్లో అతిపెద్ద ఆలయంగా పేరు గాంచింది. మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు యూఏఈలోని భారతీయులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగించనున్నారు. అబుదాబిలోని జాయెద్ స్పో్ర్ట్ సిటీ స్టేడియం ఇందుకు వేదిక కానున్నది.
ఆలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి పర్యవేక్షణలో ప్రాణం పోసుకుంటున్న ఈ ఆలయం వచ్చే ఫిబ్రవరి 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 15న స్వామి మహరాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు మందుగానే ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజస్ట్రేషన్ చేసుకోవలసి ఉన్నది.
అబుదాబిలో హిందూ దేవాలయ నిర్మాణానికి అనుమతినిస్తూ యూఏఈ ప్రభుత్వం 2015 ఆగస్టులో భూమిని కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు, రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 27 ఏకరాల భూమిని బహుమానంగా BAPS(బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ)కి ఇచ్చారు. 2018 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పింక్ సాండ్‌స్టోన్‌తో నిర్మితమవుతున్న ఈ ఆలయం దాదాపు 1000 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఆలయం సంప్రదాయ, ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా నిర్మించారు. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ప్రతీకకగా ఆలయంలో ఏడు గోపురాలను నిర్మించారు. ఈ ఏడు గోపురాలే కాకుండా, ఆలయం దాని వైభవాన్ని పెంచే ఐదు అలంకారమైన గోపురాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం శిఖరం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. సందర్శకుల కేంద్రం, ప్రార్థన గది, ప్రదర్శనలు, ప్రత్యేక అభ్యాస ప్రదేశం, పిల్లల కోసం ఆట స్థలం, వివిధ థీమ్‌ల ఆధారంగా తోటలు, తాగునీటి సౌకర్యం, ఫుడ్ కోర్ట్, బుక్, గిఫ్ట్ షాప్ వంటి వాటిని కూడా ఆలయంలో నిర్మించారు. ఇక్కడ దీపావళి, గోవర్ధన్ పూజ మొదలైన అన్ని రకాల హిందూ పండుగలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు. అందువల్ల పండుగల సమయంలో ఈ ఆలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.