CM Nitish Kumar | బలపరీక్ష నెగ్గిన నితీష్ కుమార్

బీహార్ అసెంబ్లీ బలపరీక్షలో బీజేపీ స‌హ‌కారంతో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ ఛీఫ్ నితీష్ కుమార్ అల‌వోక‌గానే గెలిచారు

  • Publish Date - February 12, 2024 / 11:20 AM IST

  • ఆర్జేడి, కాంగ్రెస్‌స‌హా విప‌క్షాల వాకౌట్‌
  • నితీష్‌కు మ‌ద్ద‌తుగా ఓటేసిన ఐదుగురు ఆర్జేడి ఎమ్మెల్యేలు


CM Nitish Kumar | బీహార్ అసెంబ్లీ బలపరీక్షలో బీజేపీ స‌హ‌కారంతో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ ఛీఫ్ నితీష్ కుమార్ అల‌వోక‌గానే గెలిచారు. నితీష్ కుమార్‌కు మద్దతుగా 129 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు కావాలి. అయితే, నితీష్ వర్గం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.


నితీష్ కుమార్.. ఇంతకాలం కలిసి ఉన్న మహాఘట్‌బంధన్‌కు గుడ్ బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరారు. నితీష్‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అవిశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గి బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో సోమవారం నాడు బీహార్ అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అందరూ అనుకున్నట్లుగానే నితీష్ కుమార్ నెగ్గారు. ముందుగా వాయిస్ ఓటింగ్ నిర్వహించారు.. ఆ తరువాత వారి ఓట్లను లెక్కించారు. ఈ ఓటింగ్‌లో నితీష్ సర్కార్ నెగ్గినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు.


నితీష్‌కు అనుకూలంగా ఓటేసిన ఆర్జేడీ ఎమ్మెల్యేలు


నితీష్ కుమార్‌కు అనుకూలంగా ఐదుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఆర్జేడీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి మరీ నితీష్‌ కుమార్‌కు అనుకూలంగా ఓటు వేశారు . దీంతో అధికారపక్షం తమ ఎమ్మెల్యేలను బలవంతంగా లొంగదీసుకుందని ఆరోపిస్తూ ఆర్జేడీ, కాంగ్రెస్ సహా విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Latest News