Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఆగడం లేదు. ఏపీలో ఇటీవల పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోనూ ఓ మహిళ బర్డ్ ఫ్లూతో మరణించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలుత వేగంగా విస్తరించిన బర్డ్ ఫ్లూ మధ్యలో కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా మళ్లీ విజృంభిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ విస్తరణ కలకలం రేపుతోంది. ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టు పక్కల ఉన్న నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ వ్యాధి విస్తరణ ఆందోళన కల్గిస్తుంది. తాజాగా పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల మండలాల్లో కోళ్ల ఫామ్ లలో వేలాది కోళ్ల మృత్యువాతకు కారణమైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి విస్తరించింది.
బాట సింగారంలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో వేల కొద్దీ కోళ్లు మృత్యువాత పడ్డాయి. అధికారులు కోళ్ల రక్త నమూనాలను సేకరించి, బర్డ్ ఫ్లూ అని నిర్దారించారు. పశువైద్య, పశు సంవర్థక శాఖ సిబ్బంది ఆ ఫామ్ వద్ద కోళ్లను చంపి మట్టిలో పూడ్చిపెడుతున్నారు. కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దని అధికారుల ఆదేశించారు. ఆ కోళ్ల ఫామ్ సామర్థ్యం 36 వేల కోళ్లు కాగా, అందులో ఇప్పటికే వేలాది కోళ్లు మరణించాయి. మరో 17,521 కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు చనిపోయిన కోళ్లను జేసీబీతో గుంత తీసి పూడ్చి పెట్టారు.
వేల కోళ్ల మృతితో భారీ ఆస్థి నష్టంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు తీవ్ర విచారంలో మునిగారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణతో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు బాటసింగారానికి కిలో మీటరు పరిధిలో ఉన్న అన్ని పౌల్ట్రీల్లో కోళ్లను అధికారులు పూడ్చిపెట్టాలని సూచించారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటిల్లో నమూనాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి, ఎవరైనా బర్డ్‌ఫ్లూ లక్షణాలతో ఉన్నారా అన్న వివరాలు సేకరిస్తున్నారు.