విధాత: రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో మిషన్ 90 పేరుతో జరిగిన బీజేపీ విస్తారక్‌లు, ప్రభారీలు, పాలక్‌లు, కన్వీనర్ల సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పార్టీ నేతలతో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని, కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తామని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. అదే సమయంలో కేంద్రంలో దాదాపు తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ వ్యతిరేకత ఉన్న మాట అంతకంటే నిజం. దీన్ని బీజేపీ నేతలు అంగీకరించకపోయినా ప్రజల అభిప్రాయం ఇదే.
ఎందుకంటే ఈ తొమ్మిదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసింది వాస్తవమే. కార్పొరేట్లకు రాయితీల రూపంలో సుమారు రూ. 11 లక్షల కోట్లు కట్టబెట్టింది నిజమే. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి, నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం రేటు పెరిగింది కమలనాథుల ఏలికల కాలంలోనే అన్నది కఠిన వాస్తవమే.
2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం వ్యవసాయరంగానికి కేటాయింపులు 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించిందీ నిజమే. ఇన్ని వైఫల్యాలు దాచిపెట్టి తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీఎల్ సంతోష్ లాంటి వాళ్లు నేతలకు నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని వాళ్లు సీరియస్‌గా అధ్యయనం చేస్తే బీజేపీ బలం ఎంతో తెలుస్తుంది.
అలాగే బీజేపీ మిషన్ 90 అన్నది వినడానికి బాగానే ఉన్నా.. అది ఆచరణలో సాధ్యమౌతుందా? అన్నది ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రమే. ఆ రెండు జిల్లాల్లో 22 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ గెలువగలిగే స్థానాలు ఎన్ని? అని ఆయా జిల్లాల్లోని బీజేపీ కార్యకర్తలను అడిగితే బీఎల్ సంతోష్‌కు పూర్తి స్పష్టత వస్తుంది.
మొత్తం 119 స్థానాల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ ముఖాముఖి తలపడే స్థానాలు పట్టుమని 10-15 స్థానాలు కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఎంఐఎం పోటీచేసే పాత బస్తి, నగరంలోని మరో 5 స్థానాల్లో తప్పా బీజేపీ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపగలిగే స్థానాలు లేవనే చెప్పాలి.
ఇక బీఆర్‌ఎస్‌ను ఓడించిన దుబ్బాక, హుజురాబాద్ లాంటి సిట్టింగ్ స్థానాలను వచ్చే ఎన్నికల్లో తిరిగి నిలబెట్టుకుంటుందా? ఇంకా ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలో ఆ సంఖ్యను పెంచుకుంటుందా? అంటే అంత ఈజీ కాదనే సమాధనమే వస్తుంది.
ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్‌లలోని కొన్ని స్థానాల్లోనే బీజేపీ బాగా కష్టపడితే గెలిచే అవకాశం ఉన్నది. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచో, అధికార బీఆర్‌ఎస్ నుంచో ఆయా నియోజకవర్గంలో బలంగా ఉన్న మాజీలనో, అసంతృప్త నేతలు వస్తేనే కొంత ఫలితం ఉండొచ్చు.
ఎందుకంటే బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న వాళ్లను కాదని చేరిక కమిటీ పేరుతో ఇతర పార్టీల నేతలతోనే నింపేస్తున్న పరిస్థితి ఉన్నది. దీంతో ప్రస్తుత జేజేపీ నాటి వాజపేయ్, అద్వానీ నాటి పార్టీ కాదని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఇక్కడ ప్రాధాన్యం లేదని ఆ పార్టీ కార్యకర్తలే వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో బీఎల్ సంతోష్ లాంటి వారు కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని, ఆ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకే వస్తుందని అంచనా వేయడం హాస్యాస్పదంగా ఉన్నది. ఆ పార్టీ బలం ఎంతో తెలంగాణ ప్రజలకు తెలుసు. అట్లనే ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ల కార్యకర్తలకు తెలుసు.
ఇప్పుడు టార్గెట్‌లు పెట్టి, ఇతర పార్టీల నుంచి నేతలకు కండువాలు కప్పి, అంగబలం, అర్ధబలం ఉన్నవారికే టికెట్లు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 లక్ష్యాన్ని పూర్తిచేయాలనుకుంటే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాస్తవ బలం ఎంత అన్నది వారికి వచ్చే సీట్లే సమాధానం చెబుతాయని అంటున్నారు.