విధాత: భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైన పార్టీ.. దాని ఉచ్చులో పడొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఆ పార్టీ పట్ల యువత చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హుజుర్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మతాల మధ్య పంచాయతీ పెట్టడం బీజేపీ పద్ధతి అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కిషన్ రెడ్డి లాంటి సన్నాసి అన్ని అబద్ధాలు మాట్లాడుతాడు.. నిలదీస్తే సమాధానం చెప్పడు. బీజేపీ వల్ల కార్పొరేట్ శక్తులు బాగు పడ్డాయి.. ప్రజలు మరింత అగాధంలోకి వెళ్లారు. మోడీ వల్ల దేశం అప్పుల పాలైంది.. దేశం అభాసు పాలైందన్నారు. దేశానికి వేగు చుక్క మన తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు.
BRS Working President, Minister @KTRTRS addressing a public gathering in Huzurnagar.
https://t.co/9X0cScV1bW— BRS Party (@BRSparty) January 6, 2023
కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బీజేపీ వాళ్లు అని కేటీఆర్ పేర్కొన్నారు. భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయన్నారు. రూ. 30 వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని గుర్తు చేశారు.
బీజేపీ పార్టీ వల్ల ఒక దళితుడుగాని, ఒక గిరిజన వ్యక్తిగాని బాగుపడ్డ దాఖలాలు లేవు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ఇంటింటికి సీఎం కేసీఆర్ పథకాలు అందుతున్నాయని తెలిపారు. తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగు పడ్డాయి.. భారతదేశంలోనే తెలంగాణ గ్రామ పంచాయతీలు గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయని తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత హుజుర్‌నగర్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందింది అని స్పష్టం చేశారు.