Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద బీజేపీ నేతల నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీలు కె.లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా ఆ పార్టీ నాయకులు నిరనస వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ మృతులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని, ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ నిప్పులు పోస్తోందని మండిపడ్డారు. భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనన్నారు. ఉగ్రదాడి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలకు కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. అన్ని మండలాల్లో బస్తిల్లో ప్రజలు నిరసన తెలపాలని కోరారు.