కారు దారిలో కమలం కత్తి

తెలంగాణలో తన బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నది. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో గతంలో గెలిచిన నాలుగు సీట్లకు అదనంగా

  • Publish Date - January 27, 2024 / 12:02 PM IST
  • గులాబీ పార్టీ కబళింపుకు కాషయ సేన పావులు
  • జాతీయ పార్టీల ఉచ్చుతో గులాబీ పార్టీ విలవిల
  • పెంచిన పార్టీతోనే పొంచి ఉన్న ముప్పు
  • బీఆరెస్ నుంచి భారీ వలసలకు కమలం పెద్దల స్కెచ్‌
  • ప్రాంతీయ పార్టీ బలహీన పడితేనే బీజేపీ విస్తరణకు మార్గం సుగమం

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో తన బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నది. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో గతంలో గెలిచిన నాలుగు సీట్లకు అదనంగా మరో నాలుగైదు సీట్లు గెలిచి మరింత బలపడాలనే లక్ష్యంతో కమల దళం వ్యూహరచన చేస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలనే పట్టుదలతో అగ్రనాయకులు ఉన్నారు. బీఆరెస్ స్థానాన్ని ఆక్రమించుకునే పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ స్థానంలో బీజేపీని ప్రోత్సహించిన బీఆరెస్‌ అధినేతకు అదే పార్టీ ఏకు మేకుగా మారి మరణశాసనంగా మారే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అధికార సుస్థిరత..రాజకీయ ఆధిపత్య ఎత్తులలో భాగంగా అప్పటి సీఎం, బీఆరెస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అప్రమత్తమై చిత్రవిచిత్రమైన కుట్రలకు తెరలేపారు. తెలుగుదేశం పార్టీని ఖతం చేసి బీజేపీని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని కూడా నామరూపాలు లేకుండా చేసి, బీజేపీని బూస్టప్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి త్రిముఖ పోటీని సృష్టించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ముక్కలు చేసి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు గులాబీ వ్యూహాం అమలు చేశారు. కేసీఆర్ ఆశించినట్లుగా అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు బీజేపీ, బీఆరెస్ నువ్వా నేనా అనే విధంగా పోటీపడ్డాయి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని ప్రజలు కూడా భావించారు. ఎమ్మెల్సీ కె.కవితను అరెస్టు చేస్తారని, జైలు కూడు తప్పదని అందరూ అనుకుంటున్న తరుణంలో అంచనాలు తారుమారయ్యాయి.

మొదటికే మోసమైన కుమ్మక్కు రాజకీయం

ఏమైందో ఏమో కాని అకస్మాత్తుగా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీజేపీ, బీఆరెస్‌ పార్టీల మధ్య అంతర్గతంగా సఖ్యత కుదరడం, కవిత అరెస్టు కాకపోవడంతో ప్రజలు షాక్ కు గురి అయ్యారు. రెండు పార్టీలు కలిసి పోయాయని ప్రజలు చర్చించుకున్నట్లు గానే బీజేపీపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించడం, బీఆరెస్ అనుకూలుడిగా ముద్రపడిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని నియమించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ప్రజలు కె.చంద్రశేఖర్ రావుకు అసలైన శత్రువు కాంగ్రెస్ పార్టీ అనే నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని బీజేపీ నేతలుఎన్నికల్లో ఎంత చెప్పినా ప్రజలు బీజేపీని ఏమాత్రం విశ్వసించలేదు. కాంగ్రెస్ ను గెలిపిస్తే తప్ప కేసీఆర్ కుటుంబానికి సరైన శిక్ష విధించలేమనే నిర్ణయానికి వచ్చిన ప్రజలు అనుకున్నట్లుగానే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. కేసీఆర్ బీజేపీతో సాగించిన లోపాయికారి కుమ్మక్కు రాజకీయం ఆయనకు మొదటికే మోసం తెచ్చి అధికారాన్ని దూరంగా చేయగా, పాతిక సీట్ల బీజేపీ ఆశలు ఏనిమిందింటి వద్దనే ఆగాయి. ఇది ఇలా ఉండగా ప్రజలిచ్చిన మద్దతుతో కేసీఆర్ కుటుంబ అవినీతిని ఆధారాలతో సహా సిద్ధం చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. పక్కా ఆధారాలతో ప్రజల ముందు నిలబెట్టేందుకు నివేదికలను సిద్ధం చేస్తున్నది. ఓటేసిన ప్రజలు కూడా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించాలని కోరుకుంటున్నారు.

మారిన కమల వ్యూహం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాతా ప్రధాన ప్రతిపక్షంగా బీఆరెస్, ఆ తరువాత బీజేపీ 8 మంది సభ్యులతో ప్రతిపక్షంలో కూర్చున్నది. మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పెద్దల ఆలోచన, రాజకీయ వ్యూహాం సైతం మారింది. కుటుంబ పాలన, ప్రాంతీయ పార్టీ ఆధిపత్యాన్ని పాతరేసేందుకు ధీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతున్నది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఆరు నుంచి ఎనిమిది సీట్లకు తక్కువ కాకుండా విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నది. తమకు కాంగ్రెస్ నుంచి పోటీ ఉంటుందని, బీఆరెస్ కాదనే విధంగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆరెస్ నుంచి బడా నాయకులను బీజేపీలోకి రప్పించి ఎంపీ సీట్ల బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్న తీరు గులాబీ పార్టీలో గుబులు రేకేత్తిసున్నది. అదే వ్యూహంతో సొంత పార్టీ బలమైన నేతలతో పాటు వలసొచ్చే గులాబీ పార్టీ నేతలతో కలిపి రాష్ట్రంలోని 17 పార్లమెంటు సీట్లలో గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే సగానికి పైగా అభ్యర్థులను సూత్రప్రాయంగా ఖరారు చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా అభ్యర్థులకు కమలం పెద్దలు సూచించినట్లు తెలిసింది. మల్కాజిగిరి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు ను బరిలో నిలపనున్నారు. ప్రస్తుత ఎంపీలు డి.అరవింద్ ను నిజామాబాద్ నుంచి, సోయం బాపురావు ను అదిలాబాద్ నుంచి, బండి సంజయ్ ను కరీంనగర్ నుంచి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ నుంచి మళ్లీ పోటీ చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కనీసం రెండు మంత్రి పదవులు ఇవ్వాలనే నిర్ణయంలో ఢిల్లీ పార్టీ పెద్దలు ఉన్నారు.

వలసల వ్యూహంతో కారుకు పంఛర్‌

కాషాయం పెద్దలు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే బీఆరెస్ పార్టీ ఫినిష్ కావడం స్పష్టమనేది కన్పిస్తోంది. బీఆరెస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఒకప్పుడు జాకీలు పెట్టి పెంచి పోషించిన పార్టీనే ఇప్పుడు తన పార్టీకి ఉరితాడుగా మారుతుందని కలలో కూడా ఊహించకపోయి ఉండవచ్చు. గత నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే తెలంగాణలో ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉండాలి, లేదంటే తాము అధికారంలో ఉండాలి అనే విధంగా బీజేపీ పార్టీ రాజకీయాలు ఉంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో కమలం పార్టీ అగ్రనేతలు టచ్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తుంది. గతంలో ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాతోనూ, ప్రధాని వస్తే కనీసం స్వాగతించని అహంభావంతోనూ, బీఆరెస్‌ను జాతీయ పార్టీగా మార్చి ఇతర రాష్ట్రాల్లో కాలుదువ్విన తీరుతోనూ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌ను తొక్కేయడానికి ఇదే అదను అని బీజేపీ భావిస్తుంది. ప్రాంతీయ పార్టీ బీఆరెస్‌ను బలహీన పరిస్తేనే తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అవకాశముంది. ఇదే సమయంలో బీజేపీ పోటీదారైన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నందునా ప్రతిపక్ష బీఆరెస్ బలహీనంగా ఉండాలని కోరుకోవడం సహజం. ఇలా ఉభయ కుశలోపరిగా బీఆరెస్ నిర్వీర్యాన్నే కాంగ్రెస్‌, బీజేపీలు కోరుకుంటుండటంతో బీఆరెస్‌కు రానున్నరోజుల్లో పార్టీని కాపాడుకునే పనితో పాటు లోక్‌సభ ఎన్నికలు సహా స్థానిక సంస్థల ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయి.