ఏపీలో కూటమి గెలిచినా ఓడినా లబ్ధి పొందేది కాషాయపార్టీనే

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రజలకు నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పొలవరం పూర్తి, పరిశ్రమలకు రాయితీ, రాజధాని నిర్మాణానికి సహాయం

  • Publish Date - March 9, 2024 / 02:35 PM IST

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రజలకు నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పొలవరం పూర్తి, పరిశ్రమలకు రాయితీ, రాజధాని నిర్మాణానికి సహాయం ఈ మూడు పూర్తి చేసి అక్కడి ప్రజలను ఓట్లు అడిగితే బీజేపీ సొంతంగా పోటీ చేసినా ఆదరణ దక్కేది. కానీ పదేళ్లుగా విభజన సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపెట్టలేదు. ఏపీకి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఇప్పుడు కేవలం వైసీపీని గద్దె దించడానికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడబోతున్నాయన్నది స్పష్టం. కానీ వైసీపీ పాలనా వైఫల్యాలు ఎన్ని ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలూ అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అంతేకాదు అక్కడ బీజేపీకి బలమే లేదు. అలాంటి పార్టీని కూటమిలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు చేస్తున్న ప్రయోగం విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అధికారికంగా వెల్లడి కాలేదు కానీ బీజేపీ, జనసేనలకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లను ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. టీడీపీ-జనసేన పొత్తులో ఖరారు అయ్యాక ఇరు పార్టీల అధినేతలు అధికారికంగా ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇప్పుడు మరో 6 అసెంబ్లీ సీట్లు, 5 లోక్‌సభ సీట్లు జనసేన, బీజేపీలకు ఇచ్చారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఈ రెండు పార్టీలు ఎవరు ఎన్నిస్థానాల్లో పోటీ చేయనున్నారు అన్నదానిపై త్వరలో స్పష్టత రానున్నది. అయితే బీజేపీకి ఎంపీ సీట్లు కావాలి కనుక ఐదు లోక్‌సభ స్థానాలను ఆ పార్టీ కోరవచ్చు. అలాగే పది అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగవచ్చు. దీంతో జనసేన 20 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో బలమే లేని బీజేపీ పవన్‌ను ముందుపెట్టి కూటమిలోకి అడుగుపెట్టింది. చంద్రబాబు అనివార్యంగా దాన్ని అంగీకరించాల్సి వచ్చింది. కూటమిలోకి కాషాయ పార్టీ చేరిన తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలే కాదు, లెక్కలు కూడా మారనున్నాయి. వామపక్షాలు అయితే కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయవచ్చు. అది కూడా వైసీపీకి పరోక్షంగా మేలు చేస్తుంది. సిద్ధాంతపరంగా వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ లెక్కన 145 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్నది. ప్రస్తుతం అక్కడి రాజకీయ పరిణామాలను చూస్తే బీజేపీ చేరిక వల్ల కూటమికి నష్టమే తప్పా లాభం ఏమీ ఉండదు. టీడీపీ వదులుకుంటున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో జనసేన లేదా బీజేపీ పోటీ చేసినా ఓట్ల బదలాయింపు జరిగే అవకాశాలు తక్కువే. అలాగే కాంగ్రెస్‌ కూడా పోటీలో ఉంటుంది కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి దీనివల్ల రెండురకాలుగా వైసీపీ పరోక్షంగా లబ్ధి పొందనున్నది. వైసీపీలో నేతల రాజీనామా బాట పట్టి టికెట్‌ కోసం టీడీపీలో చేరుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్ననేతలే సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో పార్టీ వీడిన వాళ్లు, వీడాలని చూస్తున్న వాళ్లను ప్రస్తుత పరిణామాలు ఆలోచనలో పడేస్తాయి.

మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వల్ల ఎక్కువగా నష్టపోయేది టీడీపీనే. జనసేన ద్వారా కూటమిలోకి ఎంట్రీ ఇచ్చిన బీజేపీ అక్కడ ఆపార్టీ ద్వారానే తన బలాన్ని, ఓటు బ్యాంకు పెంచుకోనున్నది.ఆ పార్టీ సొంతంగా మెజారిటీ మార్క్‌ దాటకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వంలో బీజేపీ జోక్యం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో పదేళ్లుగా బీజేపీ అనురిస్తున్న రాజకీయ విధానాలు చూసిన ఎవరికైనా ఆ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో సైలెంట్‌గా ఉంటుంది అని భావించరు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచి కేసీఆర్‌ బీజేపీ ద్వారాలు తెరిచారు. ఇప్పుడు రాజకీయ అనివార్య పరిస్థితుల వల్ల చంద్రబాబు రాజీ పడుతున్నారు. కూటమి ఓడిపోయినా బీజేపీకి ఒరిగేది ఏమీలేదు. కానీ గెలిస్తే బాబు, పవన్‌ ఛరీష్మాతో రెండు మూడు ఎంపీ సీట్లు, నాలుగైదు అసెంబ్లీ సీట్లు తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. అంతేకాదు ఏపీలో ఎవరు గెలిచినా కేంద్రంలో తమకు మద్దతుగా ఉంటారన్నది ఆపార్టీ పెద్దల విశ్వాసం. కనుక కూటమి గెలిచినా ఓడినా లబ్ధి పొందేది కాషాయపార్టీనే అంటే అతిశయోక్తి కాదేమో!