BJP | బీజేపీ పతనం మొదలైంది.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు

BJP బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ ప్రారంభం సోనియా సహా పలువురు నేతల హాజరు నేడు హాజరుకానున్న శరద్‌పవార్‌ 26 పార్టీల అధినేతలు, ప్రతినిధుల రాక ప్రతిపక్ష కూటమికి కొత్త పేరు పెట్టే చాన్స్‌ బెంగళూరు: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల విశాల ఐక్యత దిశగా మరో కీలక అడుగు పడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా భావసారూప్యత కలిగిన దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులతో విపక్షాల రెండో సమావేశం సోమవారం బెంగళూరులో ప్రారంభమైంది. ఈ […]

  • Publish Date - July 17, 2023 / 02:41 PM IST

BJP

  • బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ ప్రారంభం
  • సోనియా సహా పలువురు నేతల హాజరు
  • నేడు హాజరుకానున్న శరద్‌పవార్‌
  • 26 పార్టీల అధినేతలు, ప్రతినిధుల రాక
  • ప్రతిపక్ష కూటమికి కొత్త పేరు పెట్టే చాన్స్‌

బెంగళూరు: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల విశాల ఐక్యత దిశగా మరో కీలక అడుగు పడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా భావసారూప్యత కలిగిన దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులతో విపక్షాల రెండో సమావేశం సోమవారం బెంగళూరులో ప్రారంభమైంది. ఈ సమావేశం మంగళవారం కూడా కొనసాగనున్నది.

యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు.. బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రె, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రె, ఆప్‌ నేతలు, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌, ఎంపీ సంజయ్‌సింగ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.

అయితే.. ప్రతిపక్ష నేతల్లో కీలకమైన ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ మాత్రం తొలి రోజు సమావేశానికి హాజరుకాలేదు. ఆయన మంగళవారం వస్తారని సమాచారం. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌లో సోమవారం సాయంత్రం మల్లికార్జున ఖర్గే ఉపన్యాసంతో సమావేశం ప్రారంభమైంది.
ఇదీ అజెండా!

కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా రచనకు ఒక కమిటీని ఈ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు. ఇదే కమిటీ ప్రతిపక్షాలను సమన్వయం చేసే పనికూడా చేపడుతుంది. రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాలపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం. యూపీఏ పేరు మార్చే అంశం కూడా చర్చకు వస్తుందని చెబుతున్నారు.

సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్‌ నేతలు.. మణిపూర్‌ హింసాకాండ, మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చడం వంటి పరిణామాలపై బీజేపీ తీరును దుయ్యబట్టారు. 30 పార్టీలతో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం నిర్వహిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాల పాట్నా సమావేశానికి ప్రతిస్పందనగా ఢిల్లీలో ఎన్డీయే సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల ఐక్యతతో ప్రధాని నరేంద్రమోదీకి భయం పట్టుకున్నదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌అబ్దుల్లా చెప్పారు.

మేం ఐక్యంగా ఉన్నాం

ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో బెంగళూరు నగర వీధులను ‘మేం ఐక్యంగా ఉన్నాం’ అనే నినాదాలతోకూడిన బ్యానర్లు, కటౌట్లతో అలంకరించారు. వాటిలో సోనియా, మల్లికార్జన ఖర్గే, రాహుల్‌గాంధీ ఫొటోలతోపాటు.. మమతాబెనర్జీ, శరద్‌పవార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎంకే స్టాలిన్‌, వామపక్ష నేతల ఫొటోలు కూడా ఉన్నాయి.

కూటమిదే గెలుపు: సిద్ధరామయ్య

రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమి ఘన విజయం సాధిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ పతనం కర్ణాటకలో ఆ పార్టీ ఓటమితో మొదలైందని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాల ఐక్యతను కాంగ్రెస్‌ అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా పరిగణిస్తున్నది. భారత రాజకీయాల్లో ఇది ఒక గేమ్‌ చేంజర్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నది.

Latest News