Site icon vidhaatha

BRS | ప్రధాని పర్యటనను బహిష్కరించిన బీఆర్‌ఎస్‌

BRS

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు బి ఆర్ ఎస్ ప్రకటించింది. 8వ తేదీన వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న విషయం తెలిసిందే.

ఈ పర్యటనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, బీఆర్ఎస్ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లూ, తమ పార్టీ నేతలు ఎవరు ఆ కార్యక్రమంలో పాల్గొనబోరంటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ప్రకటించారు.

అదేవిధంగా ప్రధాని పర్యటనకు తామంతా దూరంగా ఉంటామని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ ఈ ప్రకటన చేశారు.

కోచ్ ఫ్యాక్టరీ పై బిజెపి దాగుడుమూతలు

కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మోసపూరిత, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం వరంగల్లో జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) హాజరుకావడంలేదని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

ప్రధాని వరంగల్‌కు వస్తున్న సందర్భంగా కాజీపేటలో ఏర్పాటు చేస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ పై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పదేపదే కోరుతూ వస్తున్నదని చెప్పారు. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన ప్రభుత్వ కార్యక్రమమైనా, బీజేపీ పూర్తిగా దీన్ని పార్టీ వ్యవహారంలా నిర్వహిస్తున్నదని ప్రజలు గమనించాలని కోరారు. ఆ ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.

యువత ఉపాధి కోసం డిమాండ్

కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలని, వరంగల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని వరంగల్ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కెసిఆర్ బలంగా డిమాండు చేశారు. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ అంశాన్ని పొందుపరిచారు.

తొమ్మిదేళ్లుగా ప్రధాని నిర్లక్ష్యం

చట్టంలో పెట్టినా తొమ్మిదేండ్లుగా కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వంగానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచిగానీ ఎలాంటి స్పందన రాలేదు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని ప్రధానమంత్రిని కలిసి సీఎం విజ్ఞప్తి చేశారు. ఎన్నిసార్లు కోరినా బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి పట్టించుకోలేదు. నామమాత్రపు చర్యగా రైల్వే వ్యాగన్ పిరియాడిక్ ఓవర్ హాల్(పీవోహెచ్) ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పింది. దీనికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు అప్పగించింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పీవోహెచ్‌ను వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌గా మార్చి వరంగల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది.

కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీనే ఏర్పాటు చేయాలని బలంగా కోరుతున్నారు. ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. దేశంలో ఎక్కడా కొత్తగా కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేదిలేదని స్వయంగా పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేస్తూ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు కొత్తగా కోచ్ ఫ్యాక్టరీలను మంజూరు చేసి నిర్మిస్తున్నది. దీర్ఘకాలిక డిమాండు, విభజన చట్టంలో పేర్కొన్న కాజిపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని భారత రాష్ట్ర సమితి డిమాండు చేస్తున్నది.

బిజెపి ఎన్నికల ప్రయోజనం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించిందని బిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో హామీ గుర్తుకు వచ్చి మరోసారి
మోసం చేసేందుకు ప్రధాని వరంగల్‌కు వస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇలాంటి తెలంగాణ వ్యతిరేక చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోని బీజేపీ వ్యవహారశైలిని గుర్తించాలని ప్రజలను కోరుతున్నామని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

Exit mobile version