విధాత: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆరెస్‌తో తలపడుతున్న కాంగ్రెస్.. ఈ దఫా అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నది. కానీ.. పోలింగ్‌కు ముందురోజు రైతుబంధు రూపంలో గట్టి సవాలు ఎదుర్కొంటున్నది. ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలోని 69లక్షల మంది రైతులకు 7700 కోట్లను బీఆరెస్ ప్రభుత్వం ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటకల్లా బదిలీ చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్ రోజున రైతుబంధు పథకం మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అది ఆ ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థుల విజయంలో కీలక భూమిక పోషించింది. ఈ దఫా కూడా అదే రీతిలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు 28వ తేదీన రైతుబంధు నగదు బదిలీ చేస్తుండటం సహజంగానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కలవర పెడుతున్నది. నిజానికి నామినేషన్లకు ముందుగానే రైతుబంధు సహా ఆన్‌గోయింగ్ స్కీమ్‌ల లబ్ధిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియ పూర్తి చేయించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
అయినా పోలింగ్‌కు ముందు రోజు రైతుబంధు పంపిణీకి అనుమతించడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నది. అయితే వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆరెస్ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో పాటు ఆ పార్టీ పథకాల కంటే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, మ్యానిఫెస్టో హామీలు మెరుగ్గా ఉన్నందున ఈ దఫా రైతుబంధు ప్రభావం గత ఎన్నికల మాదిరిగా ఉండకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తున్నది. అదీగాక రైతుబంధుతో వచ్చేది 10 వేలు మాత్రమేనని, తాము 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతూ రైతులు తమ చేజారిపోకుండా తంటాలు పడుతున్నది.
చర్చనీయాంశమైన చంద్రబాబు పసుపు కుంకుమ
బీఆరెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతుబంధు పంపిణీ కాంగ్రెస్‌ను భయపెడుతున్నప్పటికీ అదే సమయంలో గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన పసుపు కుంకుమ పథకం ఫలితాలను తలుచుకుంటూ ధైర్యాన్ని పొందుతున్నది. 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పసుపు కుంకుమ పథకం మూడో విడత రూ.4,000 రూపాయల చొప్పున పోలింగ్ ముందు వారి ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఇలా 93,81,118 మంది మహిళా సభ్యులకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్లో రూ.4వేల కోట్లు కేటాయించారు.
అందులో భాగంగా అదే ఏడాది ఫిబ్రవరిలో రూ.2,500, మార్చిలో రూ.3,500, ఏప్రిల్‌లో రూ.4,000 ఇస్తామని ప్రకటించారు. మూడో విడత నగదు పంపిణీపై ఎన్నికల సంఘంలో, హైకోర్టులో ప్రతిపక్షాలు సవాల్ చేసిన ఆన్ గోయింగ్ స్కీమ్ కింద అనుమతి లభించింది. దీంతో చంద్రన్న పసుపు-కుంకుమ పథకం ద్వారా దాదాపు 93,81,118 మంది మహిళా సభ్యులకు 3వ విడత నగదును బదిలీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలింగ్‌లో మహిళల ఓట్లు గంపగుత్తగా తమకే పడుతాయని ఆశించింది. అన్ని సర్వేల్లో గెలుపు తథ్యమన్న నమ్మకంతో ఉన్న వైసీపీ సైతం పసుపు కుంకుమ పథకం నగదు బదిలీతో కలవర పడింది.
అయితే ఎన్నికల్లో ప్రజలు, పసుపు కుంకుమ పథకం లబ్ధిదారులు మెజార్టీగా వైసీపీ నవరత్నాలకే జై కొట్టడంతో మళ్లీ అధికారంలోకి రావాలన్న చంద్రబాబుకు నిరాశే మిగిలింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ రైతుబంధు పథకం కూడా ఇదే తరహాలో పనిచేయదేమోనన్న సందేహాలు బీఆరెస్‌లో ఉన్నప్పటికీ.. పైకి మాత్రం ధీమాతోనే ఉన్నట్టు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో పసుపు కుంకుమ పథకం మారిదిగానే తయారవ్వాలన్న ఆశతో కాంగ్రెస్ ఉన్నది. నిజానికి ఈ సొమ్మును జనవరి-మార్చి మధ్య ఇవ్వాల్సి ఉన్నా.. ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా బీఆరెస్ ప్రభుత్వం ముందుకు జరిపింది.
పథకాలు ప్రతిసారి ఆదుకుంటాయా
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల పతనాన్ని కూడా పట్టించుకోకుండా అధికారమే పరమావధిగా పార్టీలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఎన్నికల్లో పార్టీలకు గెలుపు సోపనాలు అవుతున్నాయా అంటే గత అనుభవాలు సందేహాలను రేకేత్తిసున్నాయి. టీడీపీ అవిర్భావం నుంచి తీసుకుంటే ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల అభిమానం సాధించిన దివంగత సీఎం ఎన్‌టీఆర్ రూ.2కే పేదలకు కిలో బియ్యం పథకం ప్రకటించారు.
అయినా తదుపరి ఎన్నికల్లో ఆయన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. తర్వాత కాలంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో బియ్యాన్ని రూపాయి 90 పైసలకే ఇచ్చారు. అయినప్పటికీ ప్రజలు ఆ పార్టీని తర్వాత ఎన్నికల్లో గెలిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మరోసారి అధికారం చేపట్టిన టీడీపీలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఎన్టీఆర్ బదులు చంద్రబాబు అధికారం చేపట్టారు. ఆయన జన్మభూమి వంటి పథకాలు, డ్వాక్రా పథకాలు తెచ్చినప్పటికీ వాటితో కంటే 1999లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని.. వాజ్‌పేయి ఇమేజ్‌తో చంద్రబాబు విజయం దక్కించుకున్నారు.
2004 ఎన్నికల విషయానికి వచ్చేసరికి తనపై జరిగిన అలిపిరి మావోయిస్టు ఘటనను అడ్డు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనుకున్నా అది వర్కవుట్ కాలేదు. ఆ ఎన్నికల్లో వైఎస్ పాదయాత్ర ధాటికి టీడీపీ ఘోరంగా దెబ్బతిన్నది. వైఎస్సార్.. రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్తు వంటి సంక్షేమ పథకాలను జోరుగా అమలు చేశారు. అయితే 2009లో ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం ఆ పథకాల ప్రభావం అంతగా ఫలించక సాధారణ విజయమే కాంగ్రెస్‌కు దక్కింది. దీంతో సంక్షేమ పథకాల ప్రభావంపై సందేహాలు ముసురుకున్నాయి.
వైఎస్ చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్‌రెడ్డి కూడా వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగించడంతోపాటు మరికొన్ని కొత్త పథకాలను జోడించి అమలు చేశారు. అయినప్పటికీ రాష్ట్రం విభజన పరిణామాల నేపథ్యంలో అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. నవ్యాంధ్రలో చంద్రబాబు కూడా అనేక పథకాలు.. కానుకలు ప్రవేశ పెట్టి అమలు చేశారు. నేరుగా ప్రజలకు డబ్బులు ఇచ్చే పసుపు-కుంకుమ వంటి పథకాలను కూడా అమలు చేశారు. ఒక్కొ క్క అర్హులైన మహిళకు రూ.10 వేల చొప్పున వారి అకౌంట్లలోవేశారు.
అదే సమయంలో డ్వాక్రాద్వారా.. 20 వేల రూపాయల చొప్పున వేశారు. ఇలా కోటి మందికి ఇచ్చారు. అయినప్పటికీ.. ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం.. కనీసం 10 శాతం ఓట్లు కూడా ఆ పార్టీకి పోల్ కాలేదు. ఇక, 2019 ఎన్నికల్లో ఒక్క చాన్స్ అంటూ.. అధికారంలోకి వచ్చిన జగన్.. 151 సీట్లలో విజయం దక్కించు కుని భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో జగన్ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ప్రజలకు సామాజిక వర్గాల వారీగా.. పథకాలను అమలు చేస్తున్నారు. డబ్బులు నేరుగా ఇస్తున్నారు. ఇదే సమయంలో 2014లో తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లి రైతుబంధు సహా పలు సంక్షేమ పథకాల అండతో పాటు టీడీపీ-కాంగ్రెస్‌ల పొత్తు ప్రచారంతో గట్టెక్కారు.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళిత లబ్ధిదారుల కుటుంబానికి 5లక్షల ఆర్ధిక సహాయం బెడిసికొట్టింది. ఈ దఫా ఎన్నికల్లో మరోసారి రైతుబంధు సహా సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు. అయితే పరిశీలించాల్సిన అంశమేమిటంటే గతంలోని మెజార్టీ ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా వాటి ఆధారంగా అధికారంలోకి రాలేక పోవడం. ఇప్పుడు అక్కడ జగన్‌కు గాని, ఇక్కడ తెలంగాణలో రైతుబంధు సహా సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు ఎంతమేరకు గ్యారెంటీగా మళ్లీ అధికారం తెచ్చిపెడతాయన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.